నామినేటెడ్ పోస్టులపై నజర్ | Nazar nominated posts | Sakshi
Sakshi News home page

నామినేటెడ్ పోస్టులపై నజర్

Aug 20 2014 4:03 AM | Updated on Mar 23 2019 7:54 PM

తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్లకు కొత్త పాలక వర్గాలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆశావహులు అప్పుడే పైవరీలను మొదలుపెట్టారు.

  •      ఏఎంసీలపై సర్కార్‌లో వచ్చిన కదలిక
  •      రంగంలోకి దిగిన నేతలు  
  •      జోరందుకున్న పైరవీలు
  • సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్లకు కొత్త పాలక వర్గాలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆశావహులు అప్పుడే పైవరీలను మొదలుపెట్టారు. ప్రధానంగా నగరంలోని బోయిన్‌పల్లి, గడ్డిఅన్నారం, హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్లకు నూతన కార్యవర్గాలను నియమించాల్సి ఉంది. వీటికోసం పలువురు ప్రజాప్రతినిధులు తమ అనుచరుల పేర్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపేందుకు ఇప్పటికే జాబితాలు రూపొందించారు.

    నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరలో పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోన్న నేపథ్యంలో ఈ నియామకాలపై కసరత్తు మొదలు పెట్టింది. మార్కెట్  కమిటీలో స్థానం సంపాదించేందుకు చోటామోటా నాయకుల పైరవీలు జోరందుకున్నాయి. తమ నియోజకవర్గ పరిధిలోని కమిటీలపై పట్టు నిలుపుకొనేందుకు ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారు. అధ్యక్ష పదవి సహా కమిటీ కార్యవర్గ సభ్యులంతా తమ వర్గానికి చెందినవారే ఉండాలనేది ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.

    అయితే గ్రేటర్ పరిధిలోని మూడు వ్యవసాయ మార్కెట్లలో ఏకపక్షంగా నియామకాలు జరిగే అవకాశాలు కన్పించడం లేదు. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా తమ అభ్యర్థులకు ఆ జాబితాలో చోటు కల్పించాలని కోరుతూ అమాత్యులపై ఒత్తిడి పెంచుతున్నారు. నిజానికి 18మంది సభ్యులుండే ఈ కమిటీలో 11 మంది వ్యవసాయ రంగానికి చెందిన చిన్నాపెద్ద రైతు ప్రతినిధులుంటారు.

    మిగిలిన ముగ్గురు వ్యాపార వర్గాలకు చెందినవారు, మరో నలుగురు వ్యవసాయ శాఖ నుంచి అధికారులు ప్రభుత్వ ప్రతి నిధులుగా ఉంటారు. ఈ కమిటీల్లో తమ వ ర్గీయులకే అధిక ప్రాధాన్యం దక్కాలంటూ ప్ర జాప్రతినిధులు పట్టుదలకు పోతుండటంతో ఈ నియామకాలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి.

    హైదరాబాద్ మార్కెట్ నుంచి గుడిమల్కాపూర్‌ను, గడ్డిఅన్నారం నుంచి ఎల్బీనరగ్‌ను విడదీసి కొత్త మార్కెట్లను ఏర్పాటు చే యాలని పలువురు సూచిస్తున్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వం లోతుగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇప్పుడున్న మూడు మార్కెట్లకే తగినంతమంది సిబ్బంది లేక సతమతమవుతున్న వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు కొత్త మార్కెట్లపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement