త్యాగాలకు సిద్ధమే..!

Naini Rajender Reddy Meet To Rahul Gandhi In New Delhi - Sakshi

సాక్షిప్రతినిధి, వరంగల్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాము త్యాగాలకు సిద్ధంగా ఉన్నామని, అయితే పార్టీ కోసం పని చేసే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ఉమ్మడి వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి సూచించారు. తెలంగాణ కాంగ్రెస్‌ బృందం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని శుక్రవారం కలిసింది. ఈ బృందంలో రాజేందర్‌రెడ్డి ఉమ్మడి వరంగల్‌ జిల్లాల ప్రతినిధిగా హాజరయ్యారు. వరంగల్, నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ డీసీసీ అధ్యక్షుల బృందం తరఫున రాజేందర్‌రెడ్డి దాదాపు 10 నిమిషాలు రాహుల్‌తో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయని, కానీ క్రమశిక్షణ లేకనే పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆయన రాహుల్‌ దృష్టికి తీసుకొచ్చారు.  టికెట్ల కోసం పార్టీలు మారుతున్న వాళ్లు.. గెలిచిన తర్వాత పార్టీని నట్టేట్లో ముంచి వెళ్లిపోతున్నారని, ఇలాంటి వాళ్లకు ఈ సారి టికెట్లు ఇవ్వొద్దని రాహుల్‌కు సూచించినట్లు సమాచారం. ఈ సందర్భంగా రాహుల్‌ కల్పించుకొని ‘మీరు ఎప్పుడైనా పోటీ చేశారా?’ అని అడుగగా తాను ఇప్పటి వరకు బీఫాం చూడలేదని బదులిచ్చారు. దీంతో  ‘డోంట్‌ వర్రీ’ అని రాహుల్‌ భుజం తట్టినట్లు రాజేందర్‌రెడ్డి అనుచరులు వెల్లడించారు.
 
గెలిచే సీట్లలో రాజీ వద్దు : రాహుల్‌
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, షబ్బీర్‌ అలీ, డీకే అరుణ, రేవంత్‌రెడ్డి, సంపత్‌ తదితరులతో భేటీ అయిన రాహుల్‌ తెలంగాణ ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. పొత్తుల వ్యవహారం, అభ్యర్థుల ఎంపికపైనా చర్చిం చా రు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కచ్చితంగా గెలిచే సీట్ల విషయంలో రాజీ పడొద్దని నేతలను ఆదేశించారు. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని  పొత్తు, అభ్యర్థుల విషయంలో ఎవరూ బాహాటంగా మాట్లాడొద్దని సూచించా రు. ఏమైనా సమస్యలుంటే ఇన్‌చార్జితోగానీ తనతోగానీ నేరుగా మాట్లా్లడొచ్చని రాహుల్‌ వారికి తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top