సాధారణ ఎన్నికలకు ముందే ‘మిషన్‌’

Mission Kakatiya Scheme starts before general elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  మిషన్‌ కాకతీయ పథకం పనులన్నింటినీ వచ్చే సాధారణ ఎన్నికలకు ముందే పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వంద ఎకరాలకు మించి ఆయకట్టు ఉన్న సుమారు 30 వేల చెరువులను వచ్చే జనవరికల్లా పూర్తి చేసి గరిష్ట ఆయకట్టుకు నీరిచ్చేలా  ప్రణాళిక వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46 వేల చెరువులకుగాను ఇప్పటికే దాదాపు 18 వేల చెరువుల్లో పూడికతీత పూర్తి అయింది.

17,859 చెరువుల్లో ముగిసిన పనులు
గోదావరి, కృష్ణా బేసిన్‌లో చిన్న నీటివనరుల కింద ఉన్న 265 టీఎంసీలను వినియోగంలోకి తెచ్చేందుకు వీలుగా 46,531 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఇప్పటివరకు నాలుగు విడతలుగా 28,645 చెరువుల పునరుద్ధరణకు అనుమతులు లభించాయి. అన్ని విడతల్లో కలిపి 17,859 చెరువుల్లో పనులు పూర్తయ్యాయి. మరో 6,203 చెరువుల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌ పనులను సెప్టెంబర్‌కల్లా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి టి. హరీశ్‌రావు ఇటీవల అధికారులను ఆదేశించారు.

నాలుగో విడతలో మొత్తంగా 5,541 చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 3,437 చెరువుల్లో పూడికతీత పూర్తయింది. మిగిలిన చెరువుల్లో పనులను జనవరి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నాలుగు విడతలు కాకుండా మిగిలిన చెరువులన్నీ తక్కువ ఆయకట్టు ఉన్నవే. ఇందులోనూ ఏవైనా ప్రధానమైనవి ఉంటే వాటిని ఐదో విడత కింద సెప్టెంబర్‌లో జనవరికల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

మొత్తంగా 30 వేల చెరువుల్లో పనులను ఎన్నికలకు ముందే పూర్తి చేసి వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించాలనుకుంటున్నట్లు నీటిపారుదల వర్గాలు పేర్కొన్నాయి. అన్ని చెరువుల్లోనూ పనులు పూర్తయితే గరిష్టంగా 20–22 లక్షల ఎకరాల సాగు సాధ్యమని చిన్న నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top