దళారుల చేతిలో మిర్చి రైతు నిలువుదోపిడీ

Mirchi farmers cheated by the brokers - Sakshi

పతనమవుతున్న ధర..

క్వింటాకు ఐదారు వేల రూపాయలే

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా మిర్చి ధర భారీ గా పతనం కావడంతో.. వ్యాపారులు, దళారులు విశ్వరూపం చూపిస్తున్నారు. దీంతో బాధిత రైతులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) లేకపోవడంతో.. దళారులు, వ్యాపారులు చెప్పేదే రేటుగా మారిపోయింది. రెండు మూడు నెలల్లోనే భారీగా ధరలు పడిపోవడంతో అన్నదాతలు నష్టాలపాలవుతున్నారు. దళారులు, వ్యాపారులను నియంత్రించే వ్యవస్థ లేకపోవడంతో మిర్చి రైతులకు అన్యాయం జరుగుతోంది. ఏదో ఒక సాకు చెప్పి కీలక సమయంలో ధరలను తగ్గించేస్తున్నారు. మార్కెట్‌ అధికారులు కూడా దళారులతో కుమ్మక్కై రైతులను పట్టించుకోవడం లేదు. ఉన్నతస్థాయి యంత్రాంగం కూడా దళారుల ఆగడాలను, అన్యాయాలను అడ్డుకునే దిశగా ఆలోచించడం లేదు. వరంగల్‌ జిల్లాలో ఇటీవల రైతులు ఆందోళన చేసినా ప్రభుత్వం, అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నాయి. గతంలో కొన్ని రాష్ట్రాల్లో క్వింటా మిర్చికి రూ.1,500 వరకు బోనస్‌ ఇచ్చారు. కానీ తెలంగాణలో దీనిపై ఉలుకూ పలుకూ లేదు. వివిధ పంటలను కొంటున్న ప్రభుత్వం మిర్చిని కొనేందుకు ముందుకు రాకపోవడంపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

2, 3 నెలల్లో తగ్గిన ధర!
రాష్ట్రంలో 2018–19 సీజన్‌లో మిర్చి 1.15 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 45,025 ఎకరాలు, మహబూబాబాద్‌ జిల్లాలో 26,895 ఎకరాలు, గద్వాల జిల్లాలో 15,722 ఎకరా లు, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 4,485 ఎకరాలు సాగైంది. దేశంలో మిర్చి ఎక్కువగా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో సాగవుతోంది. ఈసారి తెలంగాణలో 1.29 లక్షల మెట్రిక్‌ టన్నుల మిర్చి ఉత్పత్తి అవుతుందని అంచనా వేశా రు. ఖమ్మం, మహబూబాబాద్‌ ప్రాంతంలో ‘తేజ’ రకం మిర్చిని అధికంగా పండిస్తుంటారు. ఈ మిర్చి నుంచి నూనెను తీసి వివిధ రకాలుగా వినియోగిస్తుంటారు. చైనా, మలేసియా, బంగ్లాదేశ్‌ తదితర దేశాల్లో ఈ ఆయిల్‌ను కారంగా వినియోగిస్తుంటారు. ఇక్కడ పండించే ‘తేజ’ రకం మిర్చి ఆధారంగా ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో చైనీయులు ఓ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. తేజ రకం మిర్చికి జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉన్నప్పటికీ వివిధ కారణాలతో పంట ఉత్పత్తి సమయంలోనే దళారులు ధరను తగ్గించటం శోచనీయం. జనవరిలో వర్షాలు రావడం, కొన్నిచోట్ల వైరస్‌ సోకడంతో ఉత్పత్తి పడిపోతుందని రైతులు అంటున్నా రు. అంతా అనుకున్నట్లుగా జరిగితే.. 35–40 క్విం టాళ్ల మధ్య ఉత్పత్తి వస్తుందని, కానీ 20–25 క్విం టాళ్లకు పడిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు మార్కెట్లో ధర పడిపోవడంతో వీరికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. 2 నెలల క్రితం రూ.11,900 ఉన్న మిర్చి ధర, ఇప్పుడు ఐదారు వేల కు మించడంలేదు. అక్కడక్కడ రూ. 7 వేలకు కొం టున్నారు. మార్కెట్‌కు సరుకు ఎక్కువగా వచ్చిందం టే చాలు వ్యాపారులు సిండికేటుగా మారి ఒక్కసారిగా ధరను పతనం చేస్తున్నారు. వానలకు మిర్చి తడిసిందని దళారులు కారణం చెబుతున్నారు. ధర రూ.10–12 వేల మధ్య ఉంటేనే గిట్టుబాటు అవుతుందని రైతులు అంటున్నారు.

ఎగుమతుల్లేవని, నాణ్యత తగ్గిందని..!
మార్కెట్‌లో డిమాండ్‌ లేకపోవడంతో ధర తగ్గుతోం దని వ్యాపారులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా మిర్చి ఎగుమతులు లేకపోవటంతో ఈ పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఎగుమతులు నిలిచినందున పంటను కొనుగోలు చేసేవారు ఆసక్తి కనబరచటం లేదని వ్యాపారులంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు, తమిళనాడుకు చెందిన దళారులు రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ల నుంచి మిర్చి కొనుగోలు చేస్తుంటారు. ఉత్పత్తి లేని గత అక్టోబర్, నవంబర్‌ నెలల్లో మిర్చి ధర రూ.12 వేల వరకు చేరింది. రెండేళ్ల క్రితం గరిష్టంగా రూ.16 వేలకూ అమ్ముడైంది. ఈ ధరతో ఉత్సాహంగా అనేకమంది పంట సాగు చేశారు. పంట చేతికందే సమయానికి రూ.10 వేలైనా ధర వస్తుందని భావించారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని వ్యాపారులు ఇష్టారాజ్యం గా ధరను నిర్ణయించి కొంటున్నారు. కూలీలకు, ఇత ర ఖర్చులకు తెచ్చిన పెట్టుబడులు తీర్చటం కోసం రైతులు పంటను అమ్మక తప్పడంలేదు. దీంతో ఇదే అదనుగా వ్యాపారులు ధరలో మరికొంత కోతబెడుతున్నారు. ఇక పంట తేమగా ఉందని, రంగు మారిందని, ఇటీవల కురిసిన వర్షాలకు పంట తడిసిందని తదితర కారణాలు చెబుతూ తమకు అవసరమైన నాణ్యతా ప్రమాణాల్లో సరుకు లేదంటూ ధరలు తగ్గించడం దోపిడీయే.

జెండా పాటకు, కొనుగోళ్లకు పొంతనేదీ?
మిర్చి కొనుగోళ్లలో జెండాపాట నిర్వహిస్తారు. నాణ్యమైన సరుకు వద్ద నిర్వహించే జెండాపాటలో వ్యాపారులు పాల్గొని గరిష్ట ధర నిర్ణయిస్తారు. అయితే ఆ ఒక్క లాట్‌కు మాత్రమే జెండాపాట ధర ఉంటుంది. ఇక మార్కెట్‌కు విక్రయానికి వచ్చిన ఇతర సరుకుకు ఆ ధరను వర్తింపజేయరు. కానీ దాన్నే అసలైన ధరగా అధికారులు చెబుతుంటారు. వ్యాపారులు, మార్కెట్‌ అధికారులు కలిసి కుమ్మక్కవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంటోంది.

ధరలో దగా
వివిధ కారణాలతో వ్యాపారులు మిర్చి ధరలో దగాకు పాల్పడుతున్నారు. పంట ఉత్ప త్తి సీజన్‌లో వ్యాపారులు సిండికేటుగా ఏర్పడి ఇష్టారాజ్యంగా ధర నిర్ణయిస్తున్నా రు. క్వింటాలుకు రూ.8,500 పలుకుతుందని పంటను అమ్మడానికి తీసుకొస్తే.. రూ.6,500 లకు అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావటంలేదు. పంట కోసిన కూలీలకు, ఇతరత్రా ఖర్చుల కోసం అమ్మక తప్పటం లేదు.
– వెంకటనారాయణ, పెద్దబీరవల్లి, బోనకల్‌ మండలం, ఖమ్మం జిల్లా

పంట లేదు.. ధర లేదు!
ఈ ఏడాది మిరపకు తెగుళ్లు విపరీతంగా నష్టం చేశాయి. దీంతో దిగుబడులు గణనీయం గా పడిపోయాయి. ఎకరాకు 40 క్వింటాళ్ల వరకు రావాల్సిన మిర్చి ఈ ఏడాది 15 క్వింటాళ్లకు మించడం లేదు. తెగుళ్ల కారణంగా పెట్టుబడులు కూడా పెరిగాయి. ధరలు ఆశాజనకంగా లేవు. అన్‌సీజన్‌లో రూ.12 వేల వరకు ఉన్న ధర ప్రస్తుతం రూ.7 వేలు దాటడం లేదు. వ్యాపారుల మాయతోనే ఈ స్థితి నెలకొంది. 
– ఎం.వెంకన్న, పూమ్యాతండా,గార్ల మండలం, మహబూబాబాద్‌ జిల్లా

1,500 బోనస్‌ ఇవ్వాలి
మిర్చికి ప్రస్తుతం క్వింటాకు రూ.5–6 వేల ధర పలుకుతోం ది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వర్షాల కారణంగా ఉత్పత్తి తగ్గింది. వ్యాపారులు ఇష్టానుసారంగా ధర నిర్ణయించి రైతులను దోపిడీ చేస్తున్నారు. ఎంఎస్‌పీ లేకపోవడంతో నియంత్రణ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం క్వింటా కు రూ.1,500 బోనస్‌గా రైతులకు ఇవ్వాలి. ప్రభుత్వమే మిర్చిని కొనుగోలు చేయాలి. 
– టి.సాగర్, కార్యదర్శి,తెలంగాణ రైతుసంఘం

వర్షాలతో నాణ్యత తగ్గింది
కీలకమైన సమయంలో వర్షాలు రావడంతో మిర్చి నాణ్యత తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ధరల్లో హెచ్చుతగ్గులు వస్తున్నాయి. సీజన్‌లో ఎంతైనా రూ.7 వేలకంటే తగ్గదని అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌ ధర రూ.8 వేల కన్నా ఎక్కువే ధర ఉంది.
– లక్ష్మీబాయి, డైరెక్టర్, మార్కెటింగ్‌శాఖ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top