
ఆదిలాబాద్ పర్యటనకు మంత్రి హరీశ్
రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖల మంత్రి టి.హరీశ్‌రావు మూడు రోజుల పాటు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.
మూడు రోజుల పాటు జిల్లాలోనే బస
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖల మంత్రి టి.హరీశ్‌రావు మూడు రోజుల పాటు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా జిల్లాలో నీటి పారుదల, మార్కెటింగ్ శాఖలకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంత్రి శనివారం బాసరలో బస చేసి.. ఆదివారం గోదావరి నదిపై బాసర వద్ద నిర్మించనున్న చెక్‌డ్యామ్‌కు శంకుస్థాపన చేస్తారు. తర్వాత ముధోల్ నియోజకవర్గం పరిధిలోని గడ్డన్న వాగు ప్రాజెక్టును సందర్శిస్తారు. ముధోల్‌లో మినీ ట్యాంక్‌బండ్ పనుల శంకుస్థాపన అనంతరం కుంటాల మండలం చకిపల్లిలో మిషన్ కాకతీయ పథకం రెండో విడత పనులను ప్రారంభిస్తారు.
తర్వాత మంజులాపూర్ చెక్‌డ్యామ్‌కు శంకుస్థాపన చేసి మధ్యాహ్నం ఒంటి గంటకు నిర్మల్‌కు చేరుకుంటారు. నిర్మల్‌లో మార్కెటింగ్ శాఖ నిర్మించిన నూతన గోదామును ప్రారంభించి.. ద్యాంగాపూర్‌లో మిషన్ కాకతీయ రెండో విడత పనులను ప్రారంభిస్తారు. అనంతరం బోథ్ మండలం చింతల్బోరిలో మిషన్ కాకతీయ, గుడిహత్నూర మండలం మల్కాపూర్‌లో జైకా పథకం పనులను ప్రారంభిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో జిల్లాలో సాగునీటి పథకాలపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి సమీక్ష నిర్వహిస్తారు. ఆదివారం రాత్రి తాంసి మండలంలోని చనాకా కొరాట ప్రాజెక్టు వద్ద మంత్రి హరీశ్‌రావు బస చేస్తారు.
సోమవారం ఉదయం 7 గంటలకు చనాకా కొరాట బ్యారేజీ సందర్శన అనంతరం ఉట్నూరులోని కొమురం భీమ్ కాంప్లెక్స్‌ను సందర్శిస్తారు. లక్సెట్టిపేట మండలం ఇటిక్యాలలో మినీ ట్యాంక్‌బండ్ పనులు, తిర్యాని వద్ద ఎన్టీఆర్‌సాగర్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. తర్వాత కోసిని రిజర్వాయర్, జగన్నాథపూర్ ప్రాజెక్టు సందర్శన అనంతరం సాయంత్రం ఆరు గంటలకు కాగజ్‌నగర్ నుంచి రైలుమార్గంలో బయలుదేరి సోమవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
‘జూరాల’ బాధితులకు సత్వరమే పరిహారమివ్వాలి: డీకే అరుణ
మహబూబ్‌నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు త్వరగా పరిహారం ఇప్పించాలని కాంగ్రెస్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ కోరారు. ప్రాజెక్టు ముంపు బాధితులతో కలసి శనివారం సచివాలయంలో మంత్రి హరీశ్‌రావును ఆమె కలిశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి... వీలైనంత త్వరగా బాధితులకు పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.