తన అంత్యక్రియలకు తానే విరాళం

Man Commits Suicide Before Self Donation For Funeral - Sakshi

విరాళం ఇచ్చిన మూడో రోజే ఆత్మహత్య  

ఒంటరితనం భరించలేక చనిపోతున్నట్లు లేఖ

బంజారాహిల్స్‌: ‘నాకు నా జీవితం నచ్చలేదు... నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు... నేను చనిపోతే ఎవరూ బాధపడొద్దు.. అంటూ ఓ అనాథ యువకుడు లేఖరాసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం బంజారాహిల్స్‌ పరిధిలో చోటు చేసుకుంది. తన అంత్యక్రియలు ఎవరు చేయాలో నిర్ణయించుకుని ముందే వారిని కలిసి ఆ సంస్థకు విరాళంగా రూ.6 వేలు ఇచ్చాడు. చనిపోయిన తర్వాత ఏ డాక్టర్‌ దగ్గరికి తన బాడీని తీసుకెళ్ళాలో.. ఎవరిని కలవాలో కూడా లేఖలో పేర్కొన్నాడు. వివరాల్లోకి వెళ్తే...  నిజామాబాద్‌ జిల్లా గాంధీనగర్‌ తండాకు చెందిన బొంతు విజయ్‌(26) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. డిగ్రీ చదివిన విజయ్‌ ఎనిమిదేళ్ళ క్రితం హైదరాబాద్‌కు వచ్చి శ్రీకృష్ణానగర్‌లో గది అద్దెకు తీసుకొని ఉంటూ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.


సర్వ్‌ నీడీ సంస్థ ప్రతినిధి గౌతమ్‌ కుమార్‌తో బొంతు విజయ్‌

గత కొంత కాలంగా తనకు ఎవరూ లేరని మానసికంగా మరింత కుంగిపోయాడు. గతంలో ఓసారి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాను చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ఉండరని భావించిన విజయ్‌ ఈ నెల 22న సర్వ్‌నీడీ(అనాథలకు అంత్యక్రియలు నిర్వహంచే సంస్థ) స్వచ్ఛంద సంస్థను సంప్రదించి మీ సంస్థ చేస్తున్న సేవ నచ్చిందని రూ.6 వేల విరాళం అందజేసి ఎవరైనా అనాథకు ఈ విరాళంగా అంత్యక్రియలు చేయాలని కోరాడు. ఆ తర్వాత రెండు రోజులకే అతను మంగళవారం రాత్రి బేగంపేట రైల్వే స్టేషన్‌లో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడె. తాను చనిపోయిన 12 గంటల్లోపు పంజగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగాలని తన పెద్దమ్మ కుమారుడైన సందీప్‌కు సమాచారం అందించాలని సూసైడ్‌ నోట్‌ రాశాడు. ఇంకా ఏమైనా సహాయం కావాలంటే డాక్టర్‌ విజయ్‌ను సంప్రదించాలని డాక్టర్‌ నంబర్‌ పేర్కొన్నాడు.

తన అంత్యక్రియలకు విరాళం
తాను చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు ఎవరూ ఇబ్బంది పడకుండా విజయ్‌ ఆదివారం రోజు రూ.6 వేల విరాళాన్ని సదరు సర్వ్‌నీడి సంస్థకు అందజేయడం సంస్థ సభ్యులను సైతం కలిచివేసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top