breaking news
Serve Need Orphanage
-
తన అంత్యక్రియలకు తానే విరాళం
బంజారాహిల్స్: ‘నాకు నా జీవితం నచ్చలేదు... నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు... నేను చనిపోతే ఎవరూ బాధపడొద్దు.. అంటూ ఓ అనాథ యువకుడు లేఖరాసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం బంజారాహిల్స్ పరిధిలో చోటు చేసుకుంది. తన అంత్యక్రియలు ఎవరు చేయాలో నిర్ణయించుకుని ముందే వారిని కలిసి ఆ సంస్థకు విరాళంగా రూ.6 వేలు ఇచ్చాడు. చనిపోయిన తర్వాత ఏ డాక్టర్ దగ్గరికి తన బాడీని తీసుకెళ్ళాలో.. ఎవరిని కలవాలో కూడా లేఖలో పేర్కొన్నాడు. వివరాల్లోకి వెళ్తే... నిజామాబాద్ జిల్లా గాంధీనగర్ తండాకు చెందిన బొంతు విజయ్(26) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. డిగ్రీ చదివిన విజయ్ ఎనిమిదేళ్ళ క్రితం హైదరాబాద్‌కు వచ్చి శ్రీకృష్ణానగర్‌లో గది అద్దెకు తీసుకొని ఉంటూ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. సర్వ్ నీడీ సంస్థ ప్రతినిధి గౌతమ్ కుమార్‌తో బొంతు విజయ్ గత కొంత కాలంగా తనకు ఎవరూ లేరని మానసికంగా మరింత కుంగిపోయాడు. గతంలో ఓసారి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాను చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ఉండరని భావించిన విజయ్ ఈ నెల 22న సర్వ్‌నీడీ(అనాథలకు అంత్యక్రియలు నిర్వహంచే సంస్థ) స్వచ్ఛంద సంస్థను సంప్రదించి మీ సంస్థ చేస్తున్న సేవ నచ్చిందని రూ.6 వేల విరాళం అందజేసి ఎవరైనా అనాథకు ఈ విరాళంగా అంత్యక్రియలు చేయాలని కోరాడు. ఆ తర్వాత రెండు రోజులకే అతను మంగళవారం రాత్రి బేగంపేట రైల్వే స్టేషన్లో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడె. తాను చనిపోయిన 12 గంటల్లోపు పంజగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగాలని తన పెద్దమ్మ కుమారుడైన సందీప్‌కు సమాచారం అందించాలని సూసైడ్ నోట్ రాశాడు. ఇంకా ఏమైనా సహాయం కావాలంటే డాక్టర్ విజయ్ను సంప్రదించాలని డాక్టర్ నంబర్ పేర్కొన్నాడు. తన అంత్యక్రియలకు విరాళం తాను చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు ఎవరూ ఇబ్బంది పడకుండా విజయ్ ఆదివారం రోజు రూ.6 వేల విరాళాన్ని సదరు సర్వ్‌నీడి సంస్థకు అందజేయడం సంస్థ సభ్యులను సైతం కలిచివేసింది. -
గౌతమ్‌కి ఫ్యాన్ అయిపోయా...
అనాథలకు ‘స్టార్’ వంటకాలు రుచి చూపిస్తున్న ఉలవచారు రెస్టారెంట్ సామాజిక సేవలో మేము సైతం అంటున్న నిర్వాహకులు మహానగరంలో అనాథలు ఎందరో. ఎక్కడో పుట్టి.. ఇక్కడ అనాథాశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులెందరో. అందరిలా వారికీ పసందైన రుచులను ఆస్వాదించాలని ఉంటుంది. కానీ వారికిది సాధ్యమేనా? ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ... ‘స్టార్’ వంటకాలను వారి చెంతకు చేరుస్తూ... సేవా రుచిని చాటుకుంటోంది జూబ్లీహిల్స్‌లోని ‘ఉలవచారు’ రెస్టారెంట్. హైదరాబాద్: సామాజిక సేవలో తాము సైతమంటున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు వినయ్, విజయ్. నగరంలోని అనాథాశ్రమాల్లో నెలకు ఒక ఆశ్రమాన్ని ఎంచుకొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల సికింద్రాబాద్‌లోని ‘సర్వ్ నీడీ’ అనాథాశ్రమానికి వెళ్లి అక్కడి చిన్నారులతో రోజంతా సరదాగా గడిపారు. రెస్టారెంట్లో స్పెషల్‌గా చేయించిన బిర్యానీ, కోడి వేపుడు, చికెన్ కర్రీ, పచ్చి పులుసు, గుత్తి వంకాయ కర్రీ, ఆలు కుర్మా, వెనిలా మిల్క్‌షేక్, చాకొలెట్ ఐస్‌క్రీం, బాదుషా స్వీట్... తదితర పసందైన వంటకాలను చిన్నారులకు రుచి చూపించారు. వినయ్, విజయ్ నేరుగా పిల్లలకు వడ్డించి వారి సేవా దృక్పథాన్ని చాటారు. వీరితో పాటు సినీ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి కూడా పాల్గొని సహాయ సహకారాలు అందించారు. సేవ చేయడమంటే తనకెంతో ఇష్టమని, అందుకే వీరితో కలిసి వచ్చానని సురేందర్‌రెడ్డి చెప్పారు. అనాథాలను అక్కున చేర్చుకొని వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న ‘సర్వ్ నీడీ’ అనాథాశ్రమ నిర్వాహకులు గౌతమ్‌కుమార్‌ను ఈ సందర్భంగా అభినందించారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సామాజిక సేవ.. మన బాధ్యత సామాజిక సేవ అందరి బాధ్యత అంటారు వినయ్, విజయ్. సందర్భానుసారంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ వీరు సమాజ సేవలో పాలుపంచుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరదలు వచ్చిన సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బాధితులకు ఆహారం అందజేశారు. హెల్మెట్ వాడకంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం కల్పించే పలు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. గౌతమ్‌కి ఫ్యాన్ అయిపోయా... ఎప్పుడూ షూటింగ్‌తో బిజీగా ఉండే నేను.. తీరిక చూసుకొని అనాథాశ్రమాలకు వెళ్తుంటాను. నా భార్య దీపకు కూడా సేవా కార్యక్రమాలంటే ఇష్టం. అందుకే ఇద్దరం కలిసి వెళ్తుంటాం.. చేస్తుంటాం. అనాథల కోసం ఇంత చేస్తున్న గౌతమ్‌ని చూశాక.. ఆయనకు నేను ఫ్యాన్ అయిపోయాను. తమ బాధ్యతగా ‘ఉలవచారు’ ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేయడం అభినందనీయం. ప్రతి సంస్థ ఇలాగే ముందకురావాలి. సమాజ సేవ చేయాలి. – సురేందర్‌రెడ్డి, సినీ దర్శకుడు