మహమ్మారిలా.. చాప కింద నీరులా.. | Leprosy Desease Increasing Throught Telangana | Sakshi
Sakshi News home page

మహమ్మారిలా.. చాప కింద నీరులా..

Jan 5 2019 2:19 AM | Updated on Jan 5 2019 2:19 AM

Leprosy Desease Increasing Throught Telangana - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : చాపకింద నీరులా రాష్ట్రంలో కుష్టువ్యాధి విస్తరిస్తోంది. ఇది ఎప్పుడో గతించిందని జనం భావిస్తుంటే, దాని జాడలు ఇప్పుడు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ వ్యాధి పోయిందని వైద్య ఆరోగ్యశాఖలోని సంబంధిత నిర్మూలనా విభాగాన్ని ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయి. దాన్ని వివిధ విభాగాల్లో కలిపేశారు. సిబ్బందిని కుదించారు. నిధులకు కోత పెట్టారు.ఫలితంగా మళ్లీ వ్యాధి జాడ కనిపించి ఆందోళనకు గురిచేస్తోంది. 

ఏటా పెరుగుతున్న బాధితులు... 

2016 సంవత్సరంలో రాష్ట్రంలో 2,025 కుష్టువ్యాధి కేసులు నమోదు కాగా, 2017లో 2,910 కేసులు రికార్డు అయ్యాయి. 2017 నవంబర్‌ 13 నుంచి అదే నెల 26 వరకు తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో కేసుల గుర్తింపు చేపట్టారు. లక్షలాది మందిని పరీక్షించి 26,548 మంది అనుమానిత బాధితులను గుర్తించారు. కొత్తగా 515 కేసులు వెలుగు చూశాయి. ఇక 2018లో గత ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ నాటికి అంటే ఏడు నెలల్లోనే ఏకంగా 2,629 కేసులు నమోదయ్యాయి.

అధికంగా ఖమ్మం జిల్లాలో 189 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 158, కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 154, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 122 నమోదయ్యాయి. ఈ తీవ్రతను గమనించిన ప్రభుత్వం మళ్లీ ప్రత్యేకంగా 2018 అక్టోబర్‌ 22 నుంచి నవంబర్‌ 4 వరకు 29 జిల్లాల్లో లక్షలాది మందిని పరీక్ష చేయించింది. దీనికోసం 25,644 టీంలు గ్రామాల్లో పర్యటించాయి. మొత్తంగా 79,821 మంది అనుమానితులను గుర్తించారు. అందులో 1337 మందికి సోకినట్టు నిర్ధారించారు. కేవలం 12 రోజుల వ్యవధిలోనే ఇన్ని కేసులు నమోదు కావడం గమనార్హం.  

పడకేసిన ఎన్‌ఎల్‌ఈపీ... 
ఈ వ్యాధిని గుర్తించి, చికిత్స అందించేందుకు దేశంలోని అన్ని ప్రాంతాల్లో నేషనల్‌ లెప్రసీ ప్రోగ్రామ్‌ విభాగం కింద లెప్రసీ కంట్రోల్‌ యూనిట్‌లు ఉండేవి. వ్యాధిగ్రçస్తుల సంఖ్య బాగా తగ్గిందన్న కారణంతో 2006లో ప్రభుత్వాలు ఈ యూనిట్‌లలో కొత్త నియామకాలు నిలిపేశాయి. సిబ్బందిని ఆరోగ్య శాఖలో విలీనం చేశారు. రోగులు గుర్తించినచోట చికిత్స కొనసాగించారు. తెలంగాణలో ఈ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో 3 వేల మంది వరకు సిబ్బంది ఉండగా, ఇప్పుడు 700 మందికి కుదించారు.

పైగా గతంలో ప్రత్యేక విభాగం ఉంటే, దాన్ని ఇప్పుడు టీబీ, హెచ్‌ఐవీ తదితర విభాగాల్లో కలిపేశారు. అప్పట్లో ఈ విభాగానికి రూ. 20 కోట్ల వరకు నిధులు కేటాయిస్తే, ఇప్పుడు రూ. 3 కోట్లకు మించి బడ్జెట్‌ లేదని అధికారులు చెబుతున్నారు. 2015 నుంచి చాలా ప్రాంతాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ వ్యాధిగ్రస్తులను ఉన్న సిబ్బంది ద్వారా సర్వేలు చేయించి గుర్తించి, చికిత్స అందిస్తోంది. అందులో భాగంగానే గతేడాది అక్టోబర్‌ 22 నుంచి నవంబర్‌ 4 వరకు ప్రత్యేక సర్వే చేయించింది.  

ఇవీ లక్షణాలు...  
కుష్టులో పీబీ (పాసిబాసిల్లరి), ఎంబీ (మల్టిబాసిల్లరి)గా కేసులు ఉంటాయి. పీబీ అంటే అనుమానిత వ్యక్తి శరీరంపై దద్దులు, రాగి వర్ణపు మచ్చలు, అవయవాల్లో స్పర్శ తక్కువగా ఉండడంతో పాటు ఇతర లక్షణాలతో వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుంది. ఎంబీ కేసుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వీరికి వైద్యం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఈ వ్యాధి చలి ప్రాంతాల్లో, నదీ పరీవాహక ప్రాంతంలో వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.

కుష్టు వ్యాధిని వ్యాప్తి చేసే మైకో బ్యాక్టిరియం లెప్రే శరీరంలోకి ప్రవేశించిన ఐదు నుంచి ఏడేళ్ల కాలంలో వ్యాధి పొదిగే కాలం (ఇంకుబేషన్‌ íపీరియడ్‌) ఉండడంతో వెంటనే ఈ వ్యాధి లక్షణాలు బయటకు కనిపించకపోవడంతో వ్యాధి పెరగడానికి మరింత ఆస్కారం ఏర్పడుతోంది. గుర్తించిన వ్యాధిగ్రస్తులకు సరైన చికిత్స ద్వారా వందశాతం నయం చేయొచ్చని వైద్యులు చెబుతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement