కూలీకి వచ్చి మోసపోయారు

Labour Contractor Frauds Maharashtra Workers In Peddapalli - Sakshi

అభివృద్ధి పనులకు మహారాష్ట్ర కూలీలు  

మధ్యవర్తుల ద్వారా రప్పించుకుంటున్న కాంట్రాక్టర్లు 

కూలి డబ్బులు చెల్లించని వైనం    

పెద్దపల్లిలో రెండ్రోజులుగా కడుపుమాడుతున్న కూలీలు 

చేరదీసి భోజనం అందించిన ఓ ఆలయ నిర్వాహకులు 

కాంట్రాక్టర్ల మధ్యవర్తికోసం పోలీసుల గాలింపు..   

పెద్దపల్లి: స్థానికంగా ఉపాధిలేకపోవడంతో పిల్లా, పాపలతో రాష్ట్రంకాని రాష్ట్రమొచ్చారు. పనికి తగ్గ కూలీ ఇస్తామని ఓ కాంట్రాక్టు మధ్యవర్తి చెప్పిన మాటలకు నమ్మివచ్చి ఇప్పుడు కడుపు మాడుతున్నారు. వీరి ధీనస్థితిని గమనించిన పెద్దపల్లిలోని బాబా రాందేవ్‌ ఆలయ నిర్వాహకులు చేరదీశారు. రెండురోజులుగా ఆకలితో అలమటించడంతో ఆలయ     ఆవరణలో ఆశ్రయమిచ్చి, కడుపునిండా భోజనం పెట్టించారు.

దుబాయ్‌ తరహామోసం.. 
తెలంగాణ కూలీలు దుబాయ్‌కు వెళ్లి అక్కడ ఏజెంట్ల చేతిలో మోసపోయి ఆకలితో అలమటించిన కథనాలు నిత్యం చూస్తుంటాం. అలాంటిదే పెద్దపల్లి జిల్లాలోనూ జరిగింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజిపేటకు చెందిన మహ్మద్‌ మౌసామి మహారాష్ట్రలోని చంద్రాపూర్, కర్పోనట్‌ ప్రాంతాలకు చెందిన కూలీలను ఇక్కడికి తరలిస్తాడు. పెద్దపల్లి జిల్లాలోని పలు అభివృద్ధి పనుల నిర్మాణాల నిమిత్తం 20రోజుల క్రితం మహారాష్ట్ర నుంచి 42మంది కూలీలను రప్పించాడు. మహిళలకు రూ.300 సహాయకులకు రూ.400, మేస్త్రీకి రూ.600 రోజువారీగా చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నాడు.అయితే పెద్దపల్లిలో మూడుచోట్ల ఇప్పటికీ 20 రోజులు పనులు చేయించుకుని కేవలం పదిరోజుల కూలీ డబ్బులు చెల్లించాడు. మరో రూ.1.50లక్షలు రావాల్సి ఉండగా కాంట్రాక్టరు నుంచి సదరు మధ్యవర్తి వారంరోజుల క్రితమే వసూలు చేసుకుని పరారయ్యాడు. దీంతో ఆ వలస కూలీలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. రెండురోజులుగా పిల్లాపాపలతో 42మంది ఆకలితో అలమటిస్తున్నారు. వీరి ధీన స్థితిని గమనించిన స్థానిక  బాబా రాందేవ్‌ ఆలయ నిర్వాహకులను ఆశ్రయం కల్పించారు. వారిని చేరదీసి భోజనం అందించారు. అనంతరం స్థానిక మున్సిపల్‌ చైర్మన్‌ రాజయ్య, ఎస్సై ఉపేందర్‌కు విషయం తెలియజేశారు. వారు అక్కడికి చేరుకుని కూలీలతో మాట్లాడారు. తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు దిలీప్, ప్రకాష్, ప్రవీణ్, భగత్‌సింగ్, పన్నాలాల్, రాజేష్‌ను అభినందించారు. 

కూలీలతో మాట్లాడుతున్న ఎల్‌. రాజయ్య,  తమ పిల్లలకు భోజనం తినిపిస్తున్న కూలీలు

మధ్యవర్తికోసం గాలింపు... 
మహారాష్ట్ర వలస కూలీలకు ఇవ్వాల్సిన కూలీడబ్బులు ఇవ్వకుండా పారిపోయిన కాజిపేటకు చెందిన వ్యక్తికోసం గాలిస్తున్నట్లు ఎస్సై ఉపేందర్‌ తెలిపారు. వారి బంధువుల ద్వారా సమాచారం అందించినట్లు మున్సిపల్‌చైర్మన్‌ ఎల్‌.రాజయ్య వెల్లడించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top