కొంగొత్త ఆశలతో.. ఈ ఏడాదిలో

Kothagudem Will Development In This New Year - Sakshi

ఉపాధి మెరుగుపడే అవకాశం  

పూర్తికానున్న 30వ నంబర్‌ జాతీయ రహదారి 

అందుబాటులోకి రానున్న భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌  

పాల్వంచరూరల్‌: కోటి ఆశలతో కొంగొత్త సంవత్సరం ప్రవేశించింది. జిల్లా ప్రజలు ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. ఇటీవల కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వ కార్యాచరణ నిత్య నూతనం కావాలని కోరుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆవిర్భవించిన తర్వాత  జిల్లా ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. రాష్ట్రంలోనే  భద్రాద్రి జిల్లా పరిశ్రమల్లో ద్వితీయస్థానంలో ఉంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి.  ఒక వైపు సింగరేణి బొగ్గు గనులు, మరో వైపు పాల్వంచలో కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌(కేటీపీఎస్‌),  ఎన్‌ఎండీసీ, సారపాక ఐటీసీ, అశ్వాపురంలో భారజల కర్మాగారం, అశ్వారావుపేట పామాయిల్‌ ఫ్యాక్టరీలు జిల్లా సొంతం. ఇంకో వైపు పర్యాటక ప్రాంతాలూ ఉన్నాయి.  

కొత్త సంవత్సరంలో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు సీతారామ, మిషన్‌ భగీరథ ఫలాలు దక్కనున్నాయి. వంద కోట్ల పెట్టుబడితో భారజల కర్మాగారంలో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు, మణుగూరులో నిర్మిస్తున్న 1080 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన  భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ ఈ యేడాదిలో పూర్తికానున్నాయి. ఈ క్రమంలో దాదాపు 3వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. కొత్తగూడెంలో 1978లో ఏర్పాటైన  మైనింగ్‌ ఇంజనీరింగ్‌ కళాశాల విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందాలని జిల్లా ప్రజలు ఆశ పడుతున్నారు.
 
జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో  మైలారం, రేగళ్ల అటవీ ప్రాంతంలో 850 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయ ఏర్పాటుకు కేంద్రం నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. విమానాశ్రయం నిర్మాణం జరిగితే జిల్లాకు మణిహారంగా మారనుంది. 30వ నంబర్‌ జాతీయ రహదారి సారపాకనుంచి రుద్రంపూర్‌ వరకు నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు 80శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలి 20శాతం పనులు కూడా నూతన సంవత్సరంలో పూర్తికానున్నాయి. గోదావరి జలాలతో మాగాణిని పావనం చేయాలనే లక్ష్యంతో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో సాగునీటి ఢోకా ఉండదు. ఇంటింటికీ గోదావరి జలాలను అందించేందుకు రూ.2.242 కోట్ల వ్యయంతో  చేపట్టిన మిషన్‌ భగీరథ  ఇంట్రావిలేజ్‌ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రతి ఇంటికీ గోదావరి జలాలు అందనున్నాయి.  

దక్షిణ అయోధ్యగా కీర్తి గడించిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాభివృద్ధికి  రూ.100 కోట్లు ఇస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. ఈ నూతన సంవత్సరలోనైనా నిధులు మంజూరు కావాలని భక్తులు ఆశగా ఎదురుచుస్తున్నారు. పోడు సాగుచేసుకున్న  వందలాది మంది రైతులు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌  పట్టాల కోసం ఆశగా నిరీక్షిస్తున్నారు. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించే విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటే రైతులు అప్పుల ఊబిలోనుంచి  ఈ ఏడాది గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. ఉపాధి శాఖ గణంకాల ప్రకారం జిల్లాలో లక్షమందికిపైగా నిరుద్యోగులు ఉన్నారు. నూతన సంవత్సరంలో  ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో అభివృద్ధిలో మరింత ముందుకు సాగాలని జిల్లా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top