కోదండరాం అరెస్టు నిరసిస్తూ హైవేపై నిరసన

Kodandaram Arrested For Protesting Against Uranium Mining - Sakshi

యురేనియం తవ్వకాల వ్యతిరేక యాత్రను అడ్డుకున్న పోలీసులు

ప్రజాస్వామ్య పాలన ఏదీ?: టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం

అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ప్రభుత్వం

కోదండరాంతో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతల అరెస్ట్‌

సాక్షి, కల్వకుర్తి: పోరాటాలతో సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్య పాలన కొనసాగనివ్వడం లేదని, ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి వెళ్తున్న వారిపై ఇంతటి నిర్బంధాలు ఎందుకని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. బుధవారం నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై అధ్యయనం చేయడానికి వెళ్తున్న బృందం సభ్యులను వెల్దండలో పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. కోదండరాంతోపాటు కాంగ్రెస్‌ నాయకులను అరెస్టు చేయడానికి పోలీసులు రావడంతో వారు వాహనాలను అక్కడే ఆపి నిరసన తెలిపారు.

దీంతో హైదరాబాద్‌– శ్రీశైలం ప్రధాన రహదారిపై దాదాపు 2 గంటలపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. యురేనియం తవ్వకాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో పోలీసులు నిరసనకారులను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోదండరాం మాట్లాడుతూ గతంలో నల్లమలకు వెళ్లే వారిని మావోయిస్టుల పేరుతో అడ్డుకునేవారని, ఇప్పుడు అడవిలో పులులు, జీవరాసులకు ప్రమాదం ఉందని అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి నిర్బంధాలకు సంబంధించి ఏమైనా లిఖిత పూర్వకంగా రాసివ్వగలరా అని పోలీసులను అడిగారు. పోలీసుల సేవలు ప్రజల రక్షణకు వినియోగించాలన్నారు. కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని ఎలాంటి నిరసన చేయనివ్వడం లేదన్నారు. 

అప్పట్లో మీరే వద్దన్నారు 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న గువ్వల బాలరాజు, మాజీ ఎంపీ కవిత యురేనియం తవ్వకాలపై తవ్వకాలపై అనుమతులు రాగానే వద్దన్నారని పీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ కోదండరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ అన్నారు. అధికారంలో లేనప్పుడు వద్దన్న వారు.. అధికారంలోకి రాగానే తవ్వకాలకు అనుకూలంగా మారడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.

అనంతరం వెల్దండకు కల్వకుర్తి, అచ్చంపేట డీఎస్పీలు పుష్ప, నర్సింహులు, సీఐలు సురేందర్‌రెడ్డి, నాగరాజు, రామకృష్ణ, వివిధ పోలీస్‌స్టేషన్ల ఎస్‌ఐలు చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. నిరసనల అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. అరెస్టు అయిన వారిలో ఆయా పార్టీల నాయకులు రమేష్, మోహన్, విజయ్‌కుమార్‌రెడ్డి, పర్వత్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, ద్రోణాచార్య, శ్యాంప్రసాద్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, ధర్మరాజు, శ్రీధర్, ఖాదర్‌ పాషా, కృష్ణారెడ్డి, గగన్‌రాం, రమణ్‌సింగ్, సదానందంగౌడ్‌ తదితరులున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top