పత్తికి మద్దతు ధర నిర్ణయించాలి | kanche ailaiah about cases on him | Sakshi
Sakshi News home page

పత్తికి మద్దతు ధర నిర్ణయించాలి

Nov 3 2017 2:52 AM | Updated on Aug 31 2018 8:34 PM

kanche ailaiah about cases on him - Sakshi

హైదరాబాద్‌: పత్తికి కనీస మద్దతు ధర నిర్ణయించి, రైతులను ఆదుకోవాలని టీ మాస్‌ ఫోరం స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేయకుంటే రైతుల ఆత్మహత్యలు ఆగవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్వింటా పత్తి ఉత్పత్తికి ఎంత ఖర్చు చేస్తున్నారో లెక్కలేసి లాభసాటి ధరను నిర్ణయించాలని డిమాండ్‌ చేశారు.

ప్రస్తుతం క్వింటాకు రూ. 3,310 ఖర్చు చేస్తున్నారని, దానికి అనుగుణంగా నాసిరకం పత్తికి క్వింటాకు రూ.4,500 ధర నిర్ణయించాలని డిమాండ్‌ చేశారు. ‘ధరలను షావుకార్లు ఎలా నిర్ణయిస్తారు, వారికి ఆ అధికారం ఎవరు ఇచ్చారు.’అని ఐలయ్య ప్రశ్నించారు. పత్తి నాణ్యతను ప్రభుత్వ అధికారులే నిర్ణయించాలని కోరారు. జోకుడులో కూడా మోసం జరుగుతోందని, చదవుకున్న ప్రతి రైతుబిడ్డ తల్లిదండ్రులతోపాటు మార్కెట్‌కు వెళ్లి వ్యాపారుల మోసాలను ఎండగట్టాలని సూచించారు.

రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వంతోపాటు మోసం చేస్తున్న షావుకారులు కూడా బాధ్యలేనని ఆరోపించారు. పార్టీలు, నాయకులు చందాల కోసం మార్కెట్‌ మోసాలను ప్రోత్సహించడం సరికాదని విమర్శించారు. తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందని విమర్శించారు.

పత్తి రైతుకు ఎకరాకు 20 వేల నష్టపరిహారం చెల్లించాలని, ప్రైవేట్‌ వ్యక్తులు కొనుగోలు చేయకుండా అరికట్టాలని డిమాండ్‌ చేశారు. టి మాస్‌ ఫోరం కన్వీనర్‌ జాన్‌వెస్లీ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువకు కొనుగోలు చేసినవారిపైన కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఫోరం నాయకులు ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశ్వర్‌రావు, మన్నారం నాగరాజు, శ్రీరాం నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.
 

‘నాపై కేసులు కొట్టేయండి’
సాక్షి, హైదరాబాద్‌:
తాను ‘సామాజిక స్మగ్లర్లు–కోమటోళ్లు’పేరుతో పుస్తకం రాసినందుకు తనపై మల్కాజ్‌గిరి, కోరుట్ల, కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ కంచ ఐలయ్య గురువారం హైకోర్టులో వేర్వేరుగా మూడు పిటిషన్లు దాఖలు చేశారు. పోలీసులు నమోదు చేసిన కేసులు తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని ఐలయ్య తన పిటిషన్లలో పేర్కొన్నారు.

తాను ఏ కులాన్ని, వర్గాన్ని కించపరిచే ఉద్దేశంతో ఆ పుస్తకం రాయలేదని, పూర్వకాలంలో ఉన్న పరిస్థితులను ఆధారంగా చేసుకునే రాశానని తెలిపారు. కోమట్ల చరిత్ర, సమాజంలో వారి పాత్ర, వారి ఆర్థిక స్థితిగతులు తదితర విషయాల గురించే రాశానన్నారు. స్మగ్లర్‌ అన్న పదాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే సమస్యలు వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్మగ్లర్‌ అన్న పదానికి నిఘంటువుల్లో ఉన్న అర్థాలను వివరించారు. రచయితగా తనకున్న వాక్‌ స్వాతంత్య్రాన్ని పట్టించుకోకుండా పోలీసులు తనపై కేసులు నమోదు చేశారని వివరించారు.

తన పుస్తకంపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సైతం కొట్టేసిందని అన్నారు. పుస్తకం చదవకుండా అందులోని కొన్ని అంశాలనే తీసుకుని ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశారని తెలిపారు. వర్తించని అనేక సెక్షన్ల కింద కేసులు పెట్టారని వివరించారు. అంతేగాక ఒకే అంశానికి సంబంధించి పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం చెల్లదన్నారు. ఈ వ్యాజ్యాలు శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement