కేసీఆర్ ది హెచ్చరికనా? బెదిరింపా? | Is KCR's statement Warning or Threatening? | Sakshi
Sakshi News home page

కేసీఆర్ ది హెచ్చరికనా? బెదిరింపా?

Sep 10 2014 3:39 PM | Updated on Aug 28 2018 7:22 PM

కేసీఆర్ ది హెచ్చరికనా? బెదిరింపా? - Sakshi

కేసీఆర్ ది హెచ్చరికనా? బెదిరింపా?

కాళోజి శతజయంతి ఉత్సవాల వేదికను ఆసరాగా చేసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సంస్థలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడి జాతీయ పత్రికలను ఆకర్షించారు

కాళోజి శతజయంతి ఉత్సవాల వేదికను ఆసరాగా చేసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సంస్థలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడి జాతీయ పత్రికలను ఆకర్షించారు. మీడియాపై కేసీఆర్ వ్యవహార తీరును జాతీయ మీడియా కథనాలను ప్రముఖంగా ప్రచురించాయి. కొన్ని మీడియా సంస్థలు హెచ్చరిక అంటూ, మరి కొన్ని బెదిరింపులు అనే పదాలను పతాక శీర్షికల్లో ఉపయోగించారు. 
 
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓ రెండు ఛానెల్లు ప్రసారం చేసిన కథనాలు వివాదంగా మారాయి. కొన్ని ఛానెల్లు పనిగట్టుకుని తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బ తీయాలని కథనాల ప్రసారం చేస్తున్నాయని ఏకంగా శాసనసభలో కేసీఆర్ ప్రస్తావించారు. శాసనసభను, తెలంగాణ సంస్కృతిని కించపరిచే విధంగా కథనాలు ప్రసారం చేశారనే కారణంతో తెలంగాణ ప్రాంతంలో కొన్ని ఛానెల్లపై అప్రకటిత నిషేధాన్ని విధించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని ఆసరాగా తీసుకుని ఎంఎస్ఓలు కొన్ని ఛానెల్ల ప్రసారాన్ని నిలిపివేశారు. మీడియా ప్రసారాలను నిలిపివేస్తూ, ఎంఎస్ఓలు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా తెలంగాణ ప్రాంతంలో ప్రసారాలు మళ్లీ పునరుద్దరించేలా చేయలేకపోయారు. 
 
తాజాగా ఢిల్లీ పర్యటనలో కేంద్ర సమాచార శాఖామంత్రి ప్రకాశ్ జవదేకర్, కేసీఆర్ ల మధ్య ఈ అంశంపై చర్చ కూడా వచ్చింది. అయితే ఈ వివాదంతో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేసినట్టు వార్తలు వెలువడ్డాయి. దాంతో ప్రసారాలను పునరుద్దరించేందుకు ఎంఎస్ఓలతో చర్చలు జరుపుతామని జవదేకర్ తెలిపిన సంగతి తెలిసిందే. అయితే రెండు రోజుల పర్యటన అనంతరం ఆయా మీడియా సంస్థలు చేసిన ధర్నా, నిరసన కార్యక్రమాలతో ఈ వివాదం మరోసారి వెలుగులోకి వచ్చింది. 
 
మీడియా సంస్థల ప్రతినిధులు నిరసన వ్యక్తం చేయడంపై కేసీఆర్ ఘాటుగా స్పందిస్తూ 'తెలంగాణ ఎమ్మెల్యేలను పాచికల్లు తాగే మొకాలంటే ఈ గడ్డ మీద క్షమించాల్నా? ఇది పత్రికా స్వేచ్చ అయితదా? ఏ మీడియా చెబుతది ఇది కరెక్టని? అనేకమంది త్యాగాల ఫలితంగా రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ఎమ్మెల్యేలు కొలువుదీరిన రోజు అదేనా పద్ధతి. పాతరేస్తాం జాగ్రత్త. కేసీఆర్‌ను తిడితే బాధలేదు. తెలంగాణ శాసనసభను, తెలంగాణ వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని, ఉనికిని, గౌరవాన్ని వ్యతిరేకించేలా ఎవడు చేసినా మెడలు విరిచి అవతల పారేస్తం. మీడియా ముసుగులో ఇడియట్ ఆటలు చేస్తామంటే సాగనివ్వం. అయినా ఈ చానళ్లను మేం బ్యాన్ చేయలేదు అని అన్నారు. ఓ ప్రభుత్వ అధినేతగా కాకుండా ఓ ఉద్యమ నాయకుడిలా కేసీఆర్ మాట్లాడటంపై జాతీయ పత్రికలు స్పందించాయి.  ఈ నేపథ్యంలో గత 80 రోజులకు పైగా కొనసాగుతున్న వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం, ఎంఎస్ఓలు, మీడియా సంస్థల మధ్య నలుగుతున్న 'త్రికోణ' వివాదానికి సుఖాంతం కార్డు ఎప్పుడు పడుతుందో వేచి చూడాల్సిందే...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement