సాగునీటికి రూ.10 వేల కోట్లలోపే! | Irrigation projects budget below than Rs 10 crore | Sakshi
Sakshi News home page

సాగునీటికి రూ.10 వేల కోట్లలోపే!

Feb 23 2015 2:26 AM | Updated on Sep 2 2017 9:44 PM

సాగునీటికి రూ.10 వేల కోట్లలోపే!

సాగునీటికి రూ.10 వేల కోట్లలోపే!

సాగునీటి ప్రాజెక్టుల బడ్జెట్ అంచనా ప్రతిపాదనల్లో కత్తెర పడనుంది. ఆర్థిక శాఖ సూచన మేరకు గత ప్రతిపాదనలను రూ.10 వేల కోట్లకు నీటి పారుదల శాఖ కుదించనుంది.

ఆర్థిక శాఖ సూచన మేరకు ప్రతిపాదనలు
 పాత వాటిని కుదించనున్న నీటి పారుదల శాఖ
 త్వరలో ప్రభుత్వానికి మార్పు చేసిన అంచనాలు

 
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల బడ్జెట్ అంచనా ప్రతిపాదనల్లో కత్తెర పడనుంది. ఆర్థిక శాఖ సూచన మేరకు గత ప్రతిపాదనలను రూ.10 వేల కోట్లకు నీటి పారుదల శాఖ కుదించనుంది. ఈ మేరకు ప్రధాన ప్రాజెక్టుల పరిధిలోని చీఫ్ ఇంజనీర్లు కసరత్తు మొదలుపెట్టారు. వచ్చే వార్షిక బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టుల కోసం నీటి పారుదల శాఖ రూ.17,600 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. దీనిపై సమీక్ష నిర్వహించిన ఆర్థిక శాఖ ప్రభుత్వ ప్రాధామ్యాలు వేరుగా ఉన్న దృష్ట్యా ఆ ప్రతిపాదనలు రూ.10 వేల కోట్లకు తగ్గించుకోవాలని సూచించింది. దీంతో అధికారులు తక్షణ ఆయకట్టు, పనుల పూర్తికి అవకాశాలున్న ప్రాజెక్టులకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించించినట్లు తెలిసింది.
 
  ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు ఒక్క ఏడాదిలోనే రూ.4,850 కోట్లు ఇవ్వాలని మొదటగా కోరగా దానిని రూ.3,500 కోట్లకు కుదించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. చెరువుల పునరుద్ధరణకు రూ.3,500 కోట్లు కోరగా, వాటిని రూ. 1,500 కోట్లకు, సాగర్ ఆధునీకరణకు రూ. 300 కోట్లకు కోరగా దానిని రూ.100 కోట్లకు కుదించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. దేవాదుల ప్రాజెక్టుకు రూ.750 కోట్లు, కంతనపల్లికి రూ.500 కోట్ల మేర బడ్జెట్ ప్రతిపాదలను రూ.250 కోట్లకు తగ్గించనుండగా, నిజాంసాగర్ ఆధునీకరణకు రూ.300 కోట్లను రూ. 100 కోట్లకు కుదించే యత్నాలు జరుగుతున్నాయి. మరిన్ని ప్రాజెక్టుల పరిధిలోనూ ఇలా కోతలు పడనున్నాయి. ఇక గత ఏడాది కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టుల పరిధిలో ఈ ఏడాది భూసేకరణ, పరిహారం సమస్యలు కొలిక్కి వచ్చినందున వాటికి పూర్తి స్థాయి నిధులు కేటాయించే అవకాశం ఉంది. మధ్య తరహా ప్రాజెక్టులైన గాలివాగు, రాలివాగు, మత్తడివాగు, నీల్వాయి, జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టులకు ఆశించిన స్థాయిలోనే కేటాయింపులు చేసేందుకు ఆర్థిక శాఖ సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కుదించిన వివరాలను మరోమారు ఆర్థిక శాఖకు వివరించిన అనంతరం ప్రతిపాదిత అంచనాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు.

Advertisement
Advertisement