తెలుగు.. 4,500 ఏళ్ల వెలుగు!

India Tamil, Kannada, Malayalam, Telugu originated 4500 years ago - Sakshi

ద్రావిడ భాషా కుటుంబంలోని ఇతర భాషలూ ఇంతే

80 భాషలు, యాసలపై అంతర్జాతీయ అధ్యయనం

సాక్షి, హైదరాబాద్‌: వేయి కాదు.. రెండు వేలు కాదు.. ఏకంగా 4,500 ఏళ్లు! ఒక భాషగా తెలుగు ఉనికిలో ఉన్న కాలమిది! ఒక్క తెలుగేమిటి.. కన్నడ, తమిళ, మలయాళ భాషలతో కూడిన ద్రావిడ భాషా కుటుంబం మొత్తం ఇంత పురాతనమైందని అంటోంది జర్మనీలోని మ్యాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ద సైన్స్‌ ఆఫ్‌ హ్యూమన్‌ హిస్టరీ. ప్రాచీన భాషగా గుర్తింపు కోసం తెలుగు, కన్నడ భాషలు సుప్రీంకోర్టులో పోరాడుతున్న తరుణంలో ఈ అధ్యయనానికి ప్రాముఖ్యత ఏర్పడింది. దక్షిణాదిన ఉన్న 4 ప్రధాన భాషలతోపాటు ఎక్కడో బలూచిస్తాన్‌లో మాట్లాడే బ్రాహుయీ వంటివన్నీ ద్రావిడ భాషా కుటుంబానికే చెందుతాయి. అఫ్గానిస్తాన్‌ నుంచి బంగ్లాదేశ్‌ వరకూ ఉండే దక్షిణాసియాలో ఈ భాషా కుటుంబంలో మొత్తం 80 భాషలు, యాసలున్నాయని అంచనా.

దాదాపు 22 కోట్ల మంది మాట్లాడే ఈ వేర్వేరు భాషలు, యాసలు ఎంత పురాతనమైనవో తెలుసుకునేందుకు ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం నిర్వహించారు. ఆయా భాషలు మాట్లాడేవారి నుంచి పదాలు, వాటి అర్థాల వంటి వివరాలు సేకరించి విశ్లేషించారు. అందులో తేలిందేమిటంటే.. ఇవన్నీ 4,000 నుంచి 4,500 ఏళ్ల పురాతనమైనవీ అని! అయితే తమిళం, సంస్కృత భాషలు వీటికంటే పురాతనమైనవి కావొచ్చని, సంస్కృత భాష వినియోగం కాలక్రమంలో అంతరించిపోగా, తమిళం మాత్రం ఇప్పటికీ కొనసాగుతోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కె.విష్ణుప్రియ తెలిపారు. క్రీస్తుశకం 570 ప్రాంతానికి చెందిన కళ్లమళ్ల శాసనం తెలుగులో గుర్తించిన తొలి శాసనం అన్న సంగతి తెలిసిందే.

యురేసియా చరిత్రకు ఇవే కీలకం
యురేసియా ప్రాంతపు పూర్వ చరిత్రను తెలుసుకోవాలంటే ద్రావిడ కుటుంబ భాషలు కీలకమని, ఇవి ఇతర భాషలను ప్రభావితం చేయడమే అందుకు కారణమన్నది నిపుణుల అంచనా. ఈ భాషలన్నీ ఎప్పుడు, ఎక్కడ పుట్టాయి? ఎంత వరకూ విస్తరించాయి? అన్న అంశాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. కాకపోతే ద్రావిడులు భారత ఉపఖండానికి చెందినవారేనని ఉత్తర భారత ప్రాంతానికి ఆర్యులు రావడానికి ముందు నుంచే వీరు ఇక్కడ ఉన్నారనడంపై పరిశోధకుల మధ్య ఏకాభిప్రాయం ఉంది. క్రీ.పూ. 3500 ప్రాంతంలో ఆర్యులు భారత్‌కు వచ్చారని చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి. అయితే భారతీయుల జన్యుక్రమంలో ఇతర ప్రాంతాల వారి జన్యువులేవీ లేవని హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు పరిశోధన ద్వారా స్పష్టం చేశారు.

గణాంక శాస్త్ర పద్ధతుల ద్వారా..
ద్రావిడ కుటుంబ భాషలు ఎంత పురాతనమైనవో తెలుసుకునేందుకు మ్యాక్స్‌ప్లాంక్‌ శాస్త్రవేత్తలు ఆధునిక గణాంక శాస్త్ర పద్ధతులను ఉపయోగించారు. అన్ని ద్రావిడ కుటుంబ భాషల ప్రజల నుంచి పదాలను వాటి అర్థాలను సేకరించి అవి 4,500 ఏళ్ల పురాతనమైన భాషలు, యాసలు కావచ్చునని గుర్తించారు. పురాతత్వ ఆధారాలు దీన్ని రూఢీ చేస్తున్నాయని విష్ణుప్రియ తెలిపారు. ఇదే సమయంలోనే ద్రావిడ భాషలు ఉత్తర, మధ్య, దక్షిణ భాగాలుగా విడిపోయాయని, సంస్కృతీపరమైన మార్పులూ ఈ కాలంలోనే మొదలైనట్లు పురాతత్వ ఆధారాల ద్వారా తెలుస్తోందని వివరించారు. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ భాషల మధ్య ఉన్న సంబంధాలపై మరింత స్పష్టత రావొచ్చని, భౌగోళిక చరిత్రకూ భాషలకూ మధ్య సంబంధం కూడా తెలుస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

తెలంగాణలో తెలుగు భాషకు సంబంధించి 2 వేల సంవత్సరాల నాటి ఆధారాలు లభ్యమయ్యాయి. తాజా అధ్యయనం ప్రకారం తెలుగు 4,500 సంవత్సరాల పురాతనమైనదే అయితే తెలుగువాళ్లంతా స్వాగతించాలి. రామగిరి ఖిల్లాలో లభించిన గోపరాజుల నాణాలపై ‘అన్న’అనే తెలుగు పదం ఉంది.
– నందిని సిధారెడ్డి, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top