ఆదాయం అదుర్స్‌

Income Hike in Commercial Taxes Department - Sakshi

వాణిజ్య పన్నుల శాఖ గల్లా గలగల  

2018–19లో రూ.46 వేల కోట్ల ఆదాయం   

గతేడాదితో పోలిస్తే 18.20 శాతం వృద్ధి  

పెట్రోలియం, ఎక్సైజ్‌ నుంచే అధిక ఆదాయం  

సాక్షి సిటీబ్యూరో: వాణిజ్య పన్నుల శాఖ రాబడులు గణనీయంగా పెరిగాయి. ఉన్నతాధికారులు, సిబ్బంది సమష్టి కృషితో ఆ శాఖ ఆదాయం పెరిగింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.46 వేల కోట్ల ఆదాయం లభించింది. గతేడాదితో పోలిస్తే 18.20 శాతం వృద్ధి సాధించింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.40 వేల కోట్ల పన్ను వసూళ్లు జరగ్గా... ఈసారి రూ.46 వేల కోట్లు రావడం విశేషం. వాస్తవానికి ప్రతి ఏటా వచ్చే పన్ను వసూళ్ల ఆధారంగా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు దాన్ని 30శాతం పెంచి టార్గెట్‌ నిర్దేశించుకుంటారు. ఈ మేరకు 2018–19 లక్ష్యం రూ.52వేల కోట్లు కాగా... రూ.46వేల కోట్ల పన్ను వసూలు అయింది. 2018–19 అక్టోబర్‌లో అత్యధికంగా రూ.4,172 కోట్ల పన్ను రాబడులు వచ్చాయి. ఫిబ్రవరిలో రూ.4,152 కోట్లు, జూలైలో రూ.4,006 కోట్ల ఆదాయం వచ్చింది. మేలో అత్యల్పంగా రూ.3,226 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక ఆగస్టులో అత్యధికంగా 38.15 శాతం వృద్ధి సాధించగా... ఫిబ్రవరిలో అత్యల్పంగా 4.11 శాతం నమోదైంది. జీఎస్‌టీ వసూళ్లు రూ.1,275 కోట్లు కాగా ఎంట్రీ ట్యాక్స్, సీఎస్‌టీ డిమాండ్‌లు, లగ్జరీ ట్యాక్స్, వ్యాట్‌ ఆడిట్‌ డిమాండ్స్, ప్రొఫెషనల్‌ ట్యాక్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్యాక్స్‌తో పాటు జీఎస్టీ పరిధిలోకి రాని పెట్రోలియం, ఎక్సైజ్, పొగాకు ద్వారా రూ.21,174 కోట్ల ఆదాయం వచ్చింది.  

ఆ రెండింటి నుంచే 45శాతం..  
ఎక్సైజ్, పెట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలో లేకపోవడంతో ఈ రెండింటి నుంచే ఎక్కువ ఆదాయం సమకూరిందని అధికారులు పేర్కొన్నారు. మొత్తం పన్ను రాబడిలో ఎక్సైజ్, పెట్రోలియం నుంచే దాదాపు 45శాతం వచ్చిందని చెప్పారు. డీలర్లు, సంస్థలపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కఠిన వైఖరి అవలంబించడంతో ఆదాయం పెరిగిందన్నారు. 2018–19లో దాదాపు ఐదు వేల వాహనాలను తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. వే–బిల్లు లేని వాహనాలను అదుపులో తీసుకొని జరిమానాలు విధించడంతో ఆదాయం పెరిగిందన్నారు. వాణిజ్య పన్నుల శాఖ ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే కొన్ని వస్తువులపై ఎంట్రీ ట్యాక్స్‌ వసూలు చేస్తుంది. 2018–19లో ఈ పన్ను రూ.800 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. అధికారులు బాకాయిదారులపై దృష్టిసారించడంతో ఈ మేరకు ఆదాయం సమకూరింది. వాహనాల ఆకస్మిక తనిఖీలు, పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేయడం, బకాయిల వసూలుపై దృష్టిసారించడం తదితర చర్యలు చేపట్టారు. పన్నుల చెల్లింపులకు సంబంధించిన అన్ని లావాదేవీలను కంప్యూటరైజ్డ్‌ చేయడంతో పని మరింత సులభమైంది. జీఎస్టీ అమలు కూడా ఆదాయం పెరగడానికి దోహదపడిందని అధికారులు పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top