‘నేనూ రైతుబిడ్డనే..నాకు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం’ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె. ఇలంబరితి స్పష్టం చేశారు.
వైరా :‘నేనూ రైతుబిడ్డనే..నాకు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం’ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె. ఇలంబరితి స్పష్టం చేశారు. మండలంలోని సోమవరం పంచాయతీలో పంటలను ఆయన సోమవారం పరిశీలించారు. రోడ్డుపక్కన పొలాల్లో నాట్లు వేస్తున్న కూలీలతో కొద్దిసేపు సంభాషించారు. వ్యవసాయ పనులు ఏవిధంగా సాగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. వైరా రిజర్వాయర్ కింద నీరు విడుదల చేయక వరినాట్లు అంతగా లేవని కూలీలు బదులిచ్చారు.
రిజర్వాయర్‌కు నీరు విడుదల చేస్తే నాట్లు ఉంటాయని, తమకు వ్యవసాయ పనులు దొరుకుతాయని కూలీలు కలెక్టర్‌కు చెప్పారు. అరగంటపాటు ఆయన కూలీలతో మాట్లాడారు. నారు కట్టలు, వరి నాటు వేసే విధానాన్ని పరిశీలించారు. అంతకుముందు రిజర్వాయర్ వద్దకు కలెక్టర్ వెళ్లారు. రిజర్వాయర్‌లో ఎంత మేర నీరు ఉన్నది, సాగర్ జలాలు ఏ మేరకు అవసరం ఉన్నాయో అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రిజర్వాయర్ నింపాలని, ఎండిపోతున్న పంటలను కాపాడాలని వైరా ఎంపీపీ బొంతు సమత కలెక్టర్‌కు విన్నవించారు. వర్షాభావ పరిస్థితులపై జిల్లాలో త్వరలో శాఖలవారీగా సమీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట ఎన్నెస్పీ ఎస్‌ఈ అప్పలనాయుడు, జేడీఏ భాస్కర్‌రావు, మధిర ఏడీఏ బాబూరావు, ఐబీ ఏఈ రాణి, తదితరులున్నారు.