‘నివేదన’ వద్ద నిఘానేత్రం!

High Security At Pragathi Nivedana Sabha - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ప్రగతి నివేదన సభపై పోలీస్‌శాఖ నిఘానేత్రం పెట్టింది. అత్యాధునిక కెమెరాలను వినియోగిస్తోంది. బందోబస్తుపై అప్రమత్తంగా వ్యవహరిస్తున్న పోలీస్‌శాఖ సాంకేతిక పరిజ్ఞానంతో అపరిచితుల కదలికలపై ఓ కన్నేయనుంది. అసాంఘిక శక్తులను గుర్తించడానికి అత్యాధునిక టెక్నాలజీ కలిగిన పీటీజెడ్‌ (పాన్‌ టిల్ట్‌ జూమ్‌) కెమెరాలను ఉపయోగిస్తోంది. సభాస్థలిలో మొత్తం 112 సీసీ కెమెరాలు అమరిస్తే వాటిల్లో 16 పీటీజెడ్‌ ఉన్నాయి. ఇవి 360 డిగ్రీల కోణంతో ప్రతిక్షణం సభ పరిసర ప్రాంతాన్ని హెచ్‌డీ క్వాలిటీతో రికార్డు చేస్తాయి. అనుమానాస్పద వ్యక్తులను దగ్గర నుంచి గుర్తించడానికి జూమ్‌ చేసుకోవడమే గాకుండా నాణ్యమైన చిత్రాలను వీక్షించే అవకాశముంది. వీటిని సభ ప్రధాన వేదిక వెనుక భాగంలోని కమాండ్‌ కంట్రోల్‌ రూ మ్‌ నుంచి నియంత్రిస్తారు. సభా ప్రాంగణంలోని బందోబస్తును ఈ కెమెరాలతో డీజీపీ కూడా పర్యవేక్షించే వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు ప్రత్యేకంగా తయారు చేసిన మొబైల్‌లో యాప్‌ ద్వారా ఈ కెమెరాలను నిరంతరం పరిశీలించవచ్చు.  ఇప్పటికే పోలీసుల వద్ద ఉన్న ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టం ద్వారా అనుమానితులను సులువుగా గుర్తించవచ్చు. లగేజ్‌ చెక్‌ చేసేటప్పుడూ కూడా మాన్యువల్‌గా కాకుండా విమానాశ్రయాల్లో వినియోగించే భద్రతా పరికరాలను ఇంటలిజెన్స్‌ విభాగం వినియోగిస్తోంది.   
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top