సమాన పనికి సమాన వేతనం

High Court said the daily wage employees should be paid equally to regular employees - Sakshi

హైకోర్టు ఉత్తర్వులు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌లో దినసరి భత్యంపై పనిచేసే వాచ్‌మెన్, కామాటి, వంట మనుషులకు అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులర్‌ ఉద్యోగులతో (క్లాస్‌ ఫోర్‌) సమానంగా విధులు నిర్వహిస్తున్న తమకు కనీస వేతన స్కేల్‌ ఇవ్వాలని.. దినసరి భత్యంతో పనిచేసే ఉద్యోగుల వ్యాజ్యానికి అనుకూలంగా గతంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది. వారికి కనీస వేతన పేస్కేల్‌ అమలు చేయాలన్న సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా దినసరి వేతన ఉద్యోగులకు జీతాలివ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తేల్చి చెప్పింది.

సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని, సింగిల్‌ జడ్జి వద్దే రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసుకోవచ్చని ప్రభుత్వానికి సూచించింది.  హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయ మూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 29న హైకోర్టు సింగిల్‌ జడ్జి వద్దకు దినసరి వేతన ఉద్యోగి ఎం.కృష్ణ సహా 20 మంది దాఖలు చేసిన వ్యాజ్యాలు విచారణకు వచ్చాయి. నాలుగో తరగతి ఉద్యోగుల విధులతో సమానంగా పనిచేసే దినసరి వేతన కార్మికులకు కనీస వేతన స్కేల్‌ అమలు చేయాలని సుప్రీంకోర్టు 2016లో ఇచ్చిన తీర్పును పిటిషనర్లు సింగిల్‌ జడ్జి దృష్టికి తీసుకువచ్చారు. పిటిషనర్లకు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని సింగిల్‌ జడ్జి జారీ చేసిన ఆ ఉత్తర్వుల్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top