‘పనిచేసే చోటే నివాసం’పై ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ

High Court refusal to the Government employees Pill - Sakshi

     సర్వీస్‌ రూల్స్‌కు అనుగుణంగా ప్రభుత్వం స్పందిస్తుందని వ్యాఖ్య 

     పనిచేసే ప్రాంతంలోనే ప్రభుత్వ ఉద్యోగులు ఉండాలని కోరుతూ పిల్‌

సాక్షి, హైదరాబాద్‌: మండలస్థాయి అధికారులు, వైద్యులు తాము పని చేసే ప్రాంతంలోనే నివాసం ఉండేలా ఆదేశాలు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా పనిచేసే ప్రాంతంలోనే ప్రభుత్వ ఉద్యోగులు ఉండాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. ఉద్యోగులతో సక్రమంగా పనిచేయించుకునే అంశంపై ప్రభుత్వం సర్వీస్‌ రూల్స్‌కు అనుగుణంగా స్పందించవచ్చని ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ఆలస్యంగా వచ్చి.. తొందరగా వెళ్తున్నారు.. 
మండల కేంద్రాల్లో తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, వ్యవసాయ అధికారులు, సబ్‌ రిజిస్ట్రార్లు, ఇంజనీర్లు, పీహెచ్‌సీల్లోని వైద్యులు తదితర మండల స్థాయి అధికారులు స్థానికంగా ఉండటం లేదని, జిల్లా, పట్టణ కేంద్రాల నుంచి రోజూ వచ్చి విధులు నిర్వహించడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటూ వనపర్తి జిల్లా ఆత్మకూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వై.తిప్పారెడ్డి రాసిన లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించింది. ‘‘రోజూ 50 నుంచి వంద కిలోమీటర్ల దూరం నుంచి ఈ అధికారులు ప్రయాణించి రావడం వల్ల అలిసిపోతున్నారు. చాలామంది కార్యాలయాల్లోనే గంటకుపైగా విశ్రాంతి తీసుకుంటున్నారు. కార్యాలయాలకు ఆలస్యంగా వస్తున్నారు.. గంట ముందుగానే ఇళ్లకు వెళ్లిపోతున్నారు.

వీరిని చూసి కిందిస్థాయి ఉద్యోగులు కూడా అదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’’అని లేఖలో ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు పనిచేసే కేంద్రంలోనే వారి నివాసం ఉండేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని న్యాయాధికారులంతా వారు పనిచేసే కేంద్రాల్లోనే నివాసం ఉంటున్నారని, పని చేసే కేంద్రం నుంచి గంట సమయం విడిచి వెళ్లాలంటే ఉన్నతాధికారుల అనుమతి తీసుకుంటారని పేర్కొన్నారు. ఉద్యోగులంతా తాము పనిచేసే కేంద్రంలోనే ఉండేలా చేస్తేనే ప్రభుత్వ పాలన పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువ అవుతుందని కోరారు. ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ప్రజావసరాలు, ప్రజాహితం కోసం ప్రభుత్వం తగిన ఉత్తర్వులు జారీ చేయవచ్చని, ఇది పూర్తిగా సర్వీస్‌ నిబంధనల అమలుకు సంబంధించినది కాబట్టి తాము ఉత్తర్వులు జారీ చేయబోమని స్పష్టం చేసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top