రేవంత్‌రెడ్డికి బెయిల్‌

High Court Granted Bail To Revanth Reddy - Sakshi

నాటకీయ పరిణామాల మధ్య జైలు నుంచి తరలింపు

సాక్షి, హైదరాబాద్‌/కుషాయిగూడ: ప్రముఖుడి నివాసంపై డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించారన్న అభియోగాల కేసులో అరెస్టయిన మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి బుధవారం హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.10 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని, రాజేంద్రనగర్‌ కోర్టు నిర్ణయించిన మొత్తానికి మరో ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని షరతులు విధించింది. దర్యాప్తునకు అధికారులకు సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. బుధవారం ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ గండికోట శ్రీదేవి బెయిల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  

నాటకీయ పరిణామాల మధ్య.. 
చర్లపల్లి జైల్‌లో ఉన్న రేవంత్‌రెడ్డికి బెయిల్‌ రావడంతో బుధవారం భారీ బందోబస్తు నడుమ పోలీసులు అతన్ని జైల్‌ నుంచి తరలించారు. రేవంత్‌కి బెయిల్‌ మంజూరైన విష యం తెలిసిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమాను లు చర్లపల్లి జైల్‌ వద్దకు తరలిరావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రేవంత్‌రెడ్డి తరçఫున వాదించిన సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సల్మాన్‌ ఖుర్షీద్‌ను కలిసి వచ్చిన మాజీ ఎంపీ మల్లురవిని పోలీసులు చక్రిపురం చౌరస్తాలో అడ్డుకున్నారు. ఈ క్రమంలో మల్లురవికి పోలీసులకు నడుమ తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది.

ఇక ఇక్కడే ఉండి పోరాటం చేస్తా: రేవంత్‌ 
ఢిల్లీ వెళ్లకుండా హైదరాబాద్‌లోనే ఉంటానని, ప్రాణం ఉన్నంత వరకు టీఆర్‌ఎస్‌పై పోరాటం చేస్తానని రేవంత్‌రెడ్డి అన్నారు. జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియాతో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఈ పోరాటం నా వ్యక్తిగతం కాదని, రెండు నెలల క్రితం కేసీఆర్‌ అవినీతిని బయటపెట్టాలని రాష్ట్ర ఇన్‌చార్జి కుంతియా తనకు బాధ్యతలు అప్పగించారన్నారు. కుంతియా ఆదేశాల మేరకు జన్వాడలోని కేటీఆర్‌ ఫామ్‌హౌజ్‌ను ప్రజలకు చూపించానన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top