‘కృష్ణా’ పంచాయితీపై మంత్రుల చర్చ?

Harish and Devineni are going to meet for krishna water issue

ఒకట్రెండు రోజుల్లో భేటీ కానున్న హరీశ్, దేవినేని

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదీ జలాల వివాదాలు, లభ్యత నీటి పంపకాలపై చర్చించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నీటి పారుదలశాఖ మంత్రులు రంగంలోకి దిగనున్నారు. ఈ మేరకు వివాదాలపై చర్చించాలని మంత్రులు హరీశ్‌రావు, దేవినేని ఉమ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా నీటి పారుదల వర్గాలు వెల్లడించాయి. భేటీ తేదీలపై స్పష్టత రాకున్నా, ఒకట్రెండు రోజుల్లోనే సమావేశం అవుతారని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ భేటీకి సన్నాహకంగా అధికారులు, కృష్ణా బేసిన్‌ పరిధిలో నెలకొన్న వివాదాలు, ప్రస్తుత ప్రాజెక్టుల్లో లభ్యత జలాలపై హడావుడిగా నివేదికలు సైతం సిద్ధం చేశారు.

వీటిపై సోమవారంరాత్రి ఖమ్మం పర్యటన ముగించుకొని వచ్చిన హరీశ్‌రావు సమీక్ష జరపాల్సి ఉండగా, అది మంగళవారానికి వాయిదా పడింది. శ్రీశైలంలోకి భారీ ప్రవాహాలు వస్తున్నా, దిగువన నాగార్జునసాగర్‌లోకి పెద్దగా ప్రవాహాలు లేవు. ఈ నేపథ్యంలో రాష్ట్ర తాగునీటి అవసరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయి. దీనిపై కృష్ణాబోర్డు భేటీల్లో చర్చిస్తున్నా పెద్దగా ఫలితాలు లేవు.

ఈ నేపథ్యంలో మంత్రుల స్థాయి భేటీ నిర్వహించాలని అధికార వర్గాల నుంచి ఒత్తిడి వస్తోంది. ముఖ్యంగా శ్రీశైలంలో 834 కనీస నీటిమట్టాలకు ఎగువన 118 టీఎంసీలు, సాగర్లో 510 అడుగుల ఎగువన 13 టీఎంసీలతోపాటు జూరాల, పులిచింతలలో కలిపి మొత్తంగా 163 టీఎంసీల మేర లభ్యత జలాలున్నాయి. ఈ లభ్యత నీటికి పట్టిసీమ, మైనర్‌ వినియోగ లెక్కలను కలిపి నీటి వాటాలు కోరాలా.. లేక గత ఏడాది మాదిరి పట్టిసీమ, మైనర్‌ లెక్కలను తొలగించి, మిగిలిన లభ్యత జలాలు పంచుకోవాలా.. అన్న దానిపై స్పష్టత కోసం ఈ భేటీ ముఖ్యమని అధికార వర్గాలు సూచించినట్లు తెలిసింది.

ఎలా చూసినా, వాటాకు మించి ఏపీ నీటి వినియోగం చేసిందని, తెలంగాణకు మరిన్నిఅదనపు జలాలు దక్కాల్సి ఉందని తెలంగాణ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వీటన్నింటిపై చర్చించేందుకు మంత్రుల భేటీ మంగళవారం ఉంటుందని ప్రచారం జరగ్గా, అదే రోజున కేంద్ర జల వనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ ఏపీలో పర్యటిస్తున్న నేపథ్యంలో భేటీ జరిగే అవకాశం కనిపించడం లేదు. ఆ తర్వాత భేటీ ఉండే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top