ములుగు, నారాయణపేట జిల్లాలకు నోటిఫికేషన్‌ 

Gundala Zone Into the Yadadri district - Sakshi

కొత్తగా మోస్రా, చందూరు, నారాయణరావ్‌పేట్, చిన్న మఠంపల్లి మండలాలు 

జనగామలోని గుండాల మండలం యాదాద్రి జిల్లాలోకి.. 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటు కోసం రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాను విభజిస్తూ ఒక రెవెన్యూ డివిజన్, 9 మండలాలతో ములుగు జిల్లా.. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఒక రెవెన్యూ డివిజన్, 12 మండలాలు కలుపుతూ నారాయణపేట జిల్లా ఏర్పాటు చేసేలా డిసెంబర్‌ 31న ఈ నోటిఫికేషన్‌లు విడుదలయ్యాయి. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా ములుగు, నారాయణపేటలను కొత్త జిల్లాలుగా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల అనం తరం ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కూడా రెవెన్యూ శాఖతో జరిగిన సమీక్ష సందర్భంగా రెండు కొత్త జిల్లాల ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ నేపథ్యంలోనే కొత్త జిల్లాలుగా ములుగు, నారాయణపేటను ఏర్పాటు చేసేలా ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రాజేశ్వర్‌ తివారీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. భూపాలపల్లి జిల్లాలోని ములుగు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఉన్న ములుగు, వెంకటాపూర్, గోవిందరావ్‌పేట్, తడ్వాల్, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట్, వెంకటాపురం, వాజేడు మండలాలను ములుగు జిల్లాలో చేర్చారు. నారాయణపేట్‌ జిల్లాలో ఉన్న మండలాల విషయమై అధికారిక సమాచారం ఇంకా బయటకు రాలేదు. జిల్లాల ఏర్పాటు విషయమై జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల, గ్రామాల ప్రజల నుంచి సలహాలు, అభ్యంతరాలను ప్రభుత్వం స్వీకరించనుంది. ఈ నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి నెలరోజుల్లో భూపాలపల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లాల కలెక్టర్లకు ఎలాంటి సలహా లు, అభ్యంతరాలైనా తెలియజేయవచ్చు. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాతే కొత్త జిల్లా ఏర్పాటును గెజిట్‌లో చేరుస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. అప్పటినుంచి కొత్త జి ల్లాలు ఉనికిలోకి వస్తాయి. ఈ ప్రక్రియ పూర్తయి తే రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కి పెరగనుంది.  

కొత్తగా 4 మండలాలు..: రాష్ట్రంలో కొత్తగా మరో 4 మండలాలు ఏర్పాటయ్యాయి. బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలాన్ని విభజించి మోస్రా, చందూరు మండలాలను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతోపాటే సిధ్దిపేట రూరల్‌ మండలాన్ని విభజించి నారాయణరావుపేట మండలం.. మేడ్చల్‌ జిల్లా పరిధిలో చిన్న మఠంపల్లిని మరో మండలంగా ఏర్పాటు చేసింది. ఇక జనగామ జిల్లాలో ఉన్న గుండాల మండలాన్ని యాదాద్రి జిల్లాలో చేరుస్తూ ఉత్తర్వులిచ్చింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top