గ్రామ సభ నిర్వహిస్తాం..

Gram sabha as per law to extract land for the Mallanna Sagar project - Sakshi

‘మల్లన్నసాగర్‌’ భూసేకరణపై హైకోర్టుకు సర్కార్‌ హామీ  

సాక్షి, హైదరాబాద్‌: సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్‌ పరిధిలో నిర్మిస్తున్న మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కోసం భూమిని సేకరించేందుకు చట్ట ప్రకారం గ్రామసభ నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నాకే భూ సేకరణను కొనసాగిస్తామని తెలిపింది. ప్రభుత్వ హామీని నమోదు చేసుకున్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మల్లన్నసాగర్‌ కోసం చేస్తున్న భూ సేకరణకు సంబంధించి పూర్తి వివరాలను తెలియజేయడం లేదని, అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు ప్రభుత్వం సమయం ఇవ్వడం లేదంటూ రైతు తిరుపతి, మరో 29 మంది రైతులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ప్రాజెక్టుకు అనుమతులు రాక ముందే ప్రభుత్వం పనులు ప్రారంభించిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. జీవో 123 కొట్టేసిన తరువాత పలు గ్రామాల్లో 1,600 ఎకరాలను సేకరించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు.

ఈ విషయంలో పూర్తి వివరాలను తెలుగులో ఇవ్వాలని కోరినా పట్టించుకోవడం లేదని వివరించారు. ముందస్తు సమాచారం లేకుండా నోటీసులు జారీ చేశారన్నారు. అభ్యంతరాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదన్నారు. గ్రామ సభ నిర్వహించకుండానే భూ సేకరణను ప్రభుత్వం కొనసాగిస్తోందని వివరించారు. అందువల్ల భూ సేకరణపై స్టే ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) డి.ప్రకాశ్‌రెడ్డి స్పందిస్తూ గ్రామ సభ నిర్వహణకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top