
రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ సోమవారం యాదాద్రికి రానున్నారు. తొలుత శ్రీలక్ష్మీనరసింహస్వామి, అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తారు. సుమారు 40 నిమిషాల పాటు స్వామి సన్నిధిలో గడపనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. అనంతరం వరంగల్‌కు బయలుదేరి వెళ్తారు.
–యాదగిరిగుట్ట
సాక్షి, యాదగిరిగుట్ట (ఆలేరు) : రాష్ట్ర గవర్నర్‌గా నూతనంగా నియామకమైన తమిళసై సౌందర్ రాజన్ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి సోమవారం రానున్నారు. ఉదయం 9.30గంటలకు రాజ్‌భవన్ నుంచి ప్రత్యేక వాహనంలో బయలుదేరి రోడ్డు మార్గంలో యాదగిరిగుట్టకు 10.55గంటలకు చేరుకుంటారు. 11గంటలకు ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహిస్తారు. అనంతరం 20 నిమిషాల పాటు ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీ లిస్తారు. 11.30 నుంచి 11.40గంటల వరకు కొండపై గల హరితప్లాజా హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటారు. 11.40కి హరిత హోటల్ నుంచి బయల్దేరి యాదగిరిగుట్ట పట్టణం, యాదగిరిపల్లి, వంగపల్లి, ఆలేరు మీదుగా వరంగల్‌కు వెళ్తారు. సుమారు 40 నిమిషాల పాటు గవర్నర్ తమిళ సై సుందర్ రాజన్ యాదాద్రి క్షేత్ర సన్నిధిలో గడపనున్నారు. తొలిసారి యాదాద్రి ఆలయానికి వస్తున్న గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్‌కు స్వాగతం పలికేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గవర్నర్ రాక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి గవర్నర్‌ను కలిసి యాదాద్రి అభివృద్ధి పనులను వివరించనున్నారు.