
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లోని పరిస్థితులు, అక్కడి సమస్యలు, గతేడాది తీసుకున్న నిర్ణయాల అమలుపై గవర్నర్ నరసింహన్ సమీక్షించనున్నారు. వచ్చే నెల 8న అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉదయం 10:30 గంటలకు వైస్ చాన్స్‌లర్లతో సమీక్ష సమావేశం ఉంటుంది. ఇందుకోసం ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమావేశంలో కామన్ అకడమిక్ కేలండర్ అమలు తదితర అంశాలపై గవర్నర్ సమీక్షించనున్నారు.
బయోమెట్రిక్ విధానం అమలు, సీసీ కెమెరాల ఏర్పాటు, బడ్జెట్ సద్వినియోగపర్చుకోవడం, మౌలిక సదుపాయాల కల్పన, అధ్యాపకుల భర్తీ, పీహెచ్‌డీ ప్రవేశాలు, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగం, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, కన్సల్టెన్సీ సర్వీసెస్ ద్వారా నిధుల సమీకరణపై చర్చించనున్నారు. కొత్త కోర్సుల ప్రవేశం, ఇన్నోవేషన్, పరిశోధన ప్రాజెక్టులు, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్, అనుబంధ కాలేజీల్లో రెగ్యులర్ తనిఖీలు, హాస్టళ్లలో బయటి వ్యక్తుల నివాసం, అకడమిక్ కౌన్సిళ్ల ఏర్పాటు వంటి అంశాలపై గవర్నర్ సమీక్షించనున్నారు.