ఇంతకీ ఈ భూమి ఎవరిది?

ఇంతకీ ఈ భూమి ఎవరిది?


 సంగారెడ్డి క్రైం/మున్సిపాలిటీ: జిల్లాలోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామన్న జిల్లా యంత్రాంగం మాటలు ఆచరణలో ఒట్టిదేనని తేలిపోయింది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి ప్రధాన రహదారి పక్కనే ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యాడు.ఈ రోడ్డు వెంట కలెక్టర్, మంత్రులు వెళుతున్నా వారికి ఈ భూమి అన్యాక్రాంతం కావడం మాత్రం కనిపించడం లేదు. ఆ భూమి తమదేనంటూ ఇరిగేషన్ శాఖ అధికారులు అనేక సంవత్సరాలుగా మొత్తుకుంటున్నా వినేవారే లేరు. ఫలితంగా ఈ భూమి తమదేనంటూ సంవత్సరానికొకరు పుట్టుకొస్తున్నారు. కబ్జాకు యత్నిస్తున్నారు. తాజాగా ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆ భూమి తనదేనంటూ నిర్మాణాలు ప్రారంభించాడు.

 

 వివరాల్లోకి వెళ్లితే.. సంగారెడ్డి పట్టణ నడిబొడ్డులోని త్రినేత్ర కాంప్లెక్స్ వద్ద ఆర్‌అండ్‌బీ శాఖ కార్యాలయం వుంది. దాని పక్కనే ఇరిగేషన్ ఐబీ సెక్షన్ కార్యాలయం సర్వే నంబరు 212 కల్వకుంట శివారులో వున్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. ఈ శాఖకు సంబంధించి  ఇరిగేషన్ కార్యాలయం పక్కనే వంద గజాల ఖాళీ స్థలం ఉంది. 2009లో ఫిబ్రవరి నెలలో ఎండీ యూసుఫ్ అతని బంధువులు ఆ స్థలాన్ని ఆక్రమించుకొని రేకుల షెడ్డు ఏర్పాటు చేశారు.  ఈ విషయాన్ని ఆ శాఖ ఉన్నతాధికారులతో పాటు పోలీసులకు ఇరిగేషన్ శాఖ ఏఈఈ జనార్దన్‌రావు ఫిబ్రవరి 12న ఫిర్యాదు చేశారు.

 

 2014 మార్చినెలలో ఈ స్థలం తనదేనంటూ ఎంపీ రావు అనే వ్యక్తి రేకులతో కంచె ఏర్పాటు చేయగా ఇరిగేషన్ శాఖ సిబ్బంది వాటిని తొలగించేందుకు యత్నించారు. దీంతో వారిపై ఆ వ్యక్తి దౌర్జన్యం చేసిన ట్లు శాఖ ఏఈఈ ఎం.రామ్‌కిషోర్ మార్చి 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆ స్థలం తనదేనంటూ ఏకంగా గుంతలు తవ్వి నిర్మాణాలు చేపడుతున్నారు. అక్రమ  నిర్మాణాలను అరికట్టాలని ఇరిగేషన్ ఐబీ సెక్షన్ ఏఈఈ  రామ్‌కిషోర్ రెవెన్యూ శాఖతో పాటు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆక్రమణదారులు నిర్మాణాలను ఆపకుండా కొనసాగిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను ఆపాలని సీపీఎం నాయకులు సైతం ఇటీవల అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ చోటు చేసుకుంది. కాగా సంగారెడ్డి నుంచి రాజంపేట వరకు 40 అడుగుల రోడ్డు ఉండగా ఆ నిర్మాణం చేపడితే రోడ్డు సైతం 20 అడుగులకు కుదించుకుపోతుంది.

 

రెవెన్యూ అధికారుల కుమ్మక్కు

జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని ప్రధాన రహదారి పక్కనే ప్రభుత్వ స్థలం కబ్జాకు గురవుతున్నప్పటికీ పట్టించుకొనే వారేకరువయ్యారు. ఆ స్థలం తమ శాఖకు సంబంధించిందని ఇరిగేషన్ అధికారులు ఏళ్ల తరబడి చెబుతున్నా వారికి సహకరించే అధికారులే లేరు. జిల్లా యంత్రాంగం నిద్ర పోతుండటంతో కబ్జాదారులతో రెవెన్యూ అధికారులు కుమ్మక్కయి వారికి వత్తాసు పలుకుతున్నారు. నిర్మాణాలను అరికట్టి ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా చూడాలని ఇరిగేషన్ అధికారి మున్సిపల్, రెవెన్యూ అధికారులకు విన్నవిస్తున్నప్పటికీ వారు మౌనంగా ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top