శాంతించిన వరుణుడు

శాంతించిన వరుణుడు


* తగ్గుముఖం పట్టిన వానలు.. పంటలకు అపార నష్టం

* నేలమట్టమైన ఇళ్లు.. తెగిపోయిన రోడ్లు.. పలుచోట్ల రాకపోకలు బంద్

* వరదలకు నలుగురు మృతి.. పలువురి గల్లంతు


సాక్షి నెట్‌వర్క్: ఐదురోజులపాటు కుండపోతగా కురిసిన వర్షాలు ఆదివారం కాస్త శాంతించాయి! ఒక్క నిజామాబాద్ మినహా మిగతా జిల్లాల్లో తగ్గుముఖం పట్టాయి. వర్షాలు తగ్గినా వరద ఉధృతి కొనసాగుతోంది. నష్టం ఇప్పుడిప్పుడే తేలుతోంది. చాలాచోట్ల పంట లకు భారీగా నష్టం వాటిల్లింది. వేల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. పలుచోట్ల రోడ్లు తెగి రాకపోకలు స్తంభించాయి. పలు ప్రాంతాలు ముంపు ముప్పున  ఇబ్బంది పడుతున్నాయి. ప్రధాన ప్రాజెక్టులు నిండుకుండలయ్యాయి. వాగులు, వంకలు ఉరకలెత్తుతున్నాయి.

 

ఇందూరు.. ఎటుచూసినా నీరే

నిజామాబాద్ జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతోంది. మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టు నుంచి 2.46 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వచ్చి చేరుతుంది. మంజీర ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం జిల్లావ్యాప్తంగా 6.1 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. మాచారెడ్డి, కామారెడ్డిలలో భారీ వర్షం కురిసింది. దీంతో పాల్వంచ వాగు ఉధృతంగా ప్రవహించింది. సోమారంపేట, బజెపల్లి గ్రామాల్లోని చెరువులు తెగిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. జిల్లా వ్యాప్తంగా 28 వేల హెక్టార్లలో పంటనష్టం వాటిల్లింది.కామారెడ్డికి చెందిన ఫసీ(28).. వరద ఇంట్లోకి రావడంతో సామగ్రిని సర్దే క్రమంలో నీటిలో పడి మృతి చెందాడు. సిరికొండ మండలం కొండాపూర్ గడ్డమీది తండాకు చెందిన కిష్టయ్య(62) గుడిసె కూలి చనిపోయాడు. సింగూరు నీటిని నిజాంసాగర్‌కు విడుదల చేయడంతో నాగిరెడ్డిపేట మండలంలోని మాటూరు, వెంకంపల్లి జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

 

మెదక్.. వానలు తగ్గినా..

మెదక్ జిల్లాలో వర్షాలు తగ్గినా.. ఆదివారం వరద ప్రవాహం పెరిగింది. చాలాచోట్ల రోడ్లు తెగిపోయాయి. మెదక్ పట్టణంతోపాటు సమీపంలోని పాపన్నపేట, రామాయంపేటలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తూప్రాన్-హైదరాబాద్, నర్సాపూర్-హైదరాబాద్ రోడ్లను మూసివేశారు. మెదక్ డిపోలో 120 బస్సులకుగాను ఆదివారం ఐదు బస్సులే రోడ్డెక్కాయి.  వాగుల్లో పడి ముగ్గురు గల్లంతయ్యారు. జిన్నారంలోని కొడకంచి వద్ద బైక్‌తో సహా కుంటలో పడి సురేశ్ (32) చని పోయాడు. జిల్లాలో 50,805 హెక్టార్లలో పలు పంటలు, 3,200 హెక్టార్లలో కూరగాయలు దెబ్బతిన్నారుు. 900 ఇళ్లు కూలిపోయాయి.

 

ఆదిలాబాద్.. రూ.6 కోట్ల పంట నష్టం

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లోని 2,610 హెక్టార్లలో పంటలు నీట మునిగారుు. 1,593 మంది రైతులకు రూ.6 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. 49 గ్రామాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆదిలాబాద్ మండలం బంగారుగూడకు చెందిన బారురే దిలీప్ (45) వరద నీటిలో గల్లంతయ్యూడు.

 

వరంగల్.. రూ.107 కోట్ల నష్టం

వరంగల్ జిల్లాలో పంటలు, రోడ్లు దెబ్బతిన్నారుు. రూ.107 కోట్ల మేరకు పంట నష్టం వాటిల్లినట్టు అంచనా. జిల్లావ్యాప్తంగా 5 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 23 మండలాల్లో వర్షం ప్రభావాన్ని చూపింది. జిల్లాలోని పాకాల చెరువు మత్తడి పోస్తోంది.

 

ఖమ్మం.. బొగ్గు ఉత్పత్తికి బ్రేక్

ఖమ్మం జిల్లాలో తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్ట్‌ల  గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. పాలేరు రిజర్వాయర్‌లోకి భారీగా వరద చేరుతోంది. జిల్లాలో పెద్దదైన బయ్యా రం చెరువు అలుగుపోస్తోంది. సింగరేణి ఓపెన్  కాస్ట్ గనుల్లోకి వర్షపు నీరు చేరుతుండటంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది.

 

పాలమూరు.. ఉరకలెత్తుతున్న వాగులు

మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం వరకు జిల్లావ్యాప్తంగా 1.55 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ముంగిమళ్ల వాగు ఉగ్రరూపం దాల్చడంతో రాకపోకలు స్తంభించాయి.  

 

రంగారెడ్డి.. రాకపోకలు బంద్

రంగారెడ్డి జిల్లాలో కూరగాయల పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఒక్క మొయినాబాద్ మండలంలోనే 19 వేల హెక్టార్లలో ఆకు కూరల పంటలు నీట మునిగారుు. మేడ్చల్  చెరువు నుంచి శామీర్‌పేట్ చెరువుకు వాగుల ద్వారా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మేడ్చల్-కిష్టాపూర్ రోడ్డులో రాకపోకలు నిలి చిపోయాయి. పరిగి-వికారాబాద్ రూట్లో నస్కల్, పరిగి సమీపంలోని పెద్దవాగులు రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్నాయి. తాండూరు పట్టణంలోని చిలకవాగు పొంగి గ్రీన్ సిటీ జలమయమైంది.యాలాల మండలం కోకట్ వద్ద కాగ్నా నది ఉధృతి పెరిగింది. తాండూరు-హైదరాబాద్, తాండూరు-జహీరాబాద్, పెద్దేముల్-సంగారెడ్డి మార్గంలో ఉదయం 5 గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. మొయినాబాద్ మండలంలోని ఈసీ వాగులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ధారూరు మండలం కోట్‌పల్లి ప్రాజెక్టు చూసేందుకు వచ్చిన మరో వ్యక్తి కొట్టుకుపోయాడు.

 

కరీంనగర్.. ఓపెన్‌కాస్టుల్లో నీళ్లు

కరీంనగర్ జిల్లాలో ఓపెన్ కాస్టు బొగ్గు గనుల్లోకి నీరు చేరింది. గోదావరికి ఆనుకుని ఉన్న మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులో ఆదివారం బొగ్గు ఉత్పత్తి నిలిపివేసి యంత్రాలను పైకి తరలించారు. జీడీకే 1వ గని సమీపంలో వరద నీరు 829 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. మహదేవపూర్ పంకెన వద్ద గొర్రెల కాపరి అనుగుల పోశం వరదలో చిక్కుకోగా పోలీసులు పడవ ద్వారా ఒడ్డుకు చేర్చారు.  

 

4 కి.మీ. కొట్టుకుపోయి..

సిరికొండ: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూర్ వద్ద కప్పలవాగులో పడిపోయిన ఓ యువకుడు 4 కి.మీ. కొట్టుకుపోయి ఓ చెట్టు సాయంతో బతికి బయటపడ్డాడు! సిరికొండలో టీ స్టాల్ నడిపే కర్ణాటకకు చెందిన ప్రభు శనివారం సెకండ్ షో సినిమా చూసి బైక్‌పై వస్తుండగా కొండూర్ వద్ద వాగులో పడిపోయాడు. వరదలో అలాగే పెద్దవాల్గోట్ వరకు 4 కి.మీ. కొట్టుకొని పోయాడు. ఓ చెట్టును పట్టుకొని పెకైక్కిన ఆయన రాత్రంతా చెట్టుపైనే ఉన్నాడు. తెల్లవారి గ్రామస్తులు గమనించి ఒడ్డుకు చేర్చారు.

 

ప్రియాంక మృతదేహం లభ్యం

పడగల్ (వేల్పూర్): నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్‌లో శుక్రవారం నవాబు చెరువు వరదలో గల్లంతైన అంబేకర్ ప్రియాంక(25) మృతదేహం ఆదివారం లభ్యమైంది. ఎన్డీఆర్‌ఎఫ్ బృందం, స్థానిక జాలర్లు చెరువు ఒర్రెకు కింది భాగంలో నిర్మించిన మత్తడి వద్ద మృతదేహాన్ని కనుగొన్నారు. ప్రియాంకతోపాటు గల్లంతైన ఆమె కొడుకు వర్షిత్(2) ఆచూకీ తెలియలేదు. వీరికోసం శనివారం 30 మంది గజ ఈతగాళ్లతో గాలించినా ఫలితం లేక ఎన్డీఆర్‌ఎఫ్ బృందంతో గాలింపు చేపట్టాలని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top