ఓటోత్సాహం

Final Voter List Rangareddy District - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఓటు విలువపై యువత చైతన్యమైంది. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటి ఓటు హక్కు పొందేందుకు యువతీ యువకులు పోటీపడ్డారు. ఆరు నెలల్లోనే రెండు లక్షలకుపైగా యువత నూతన ఓటర్లుగా నమోదు కావడం విశేషం. ఎన్నికల విభాగం తాజాగా విడుదల చేసిన ముసాయిదా ఫొటో ఓటర్ల జాబితా ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు 31 వరకు కొత్తగా 2.05 లక్షల మంది ఓటు హక్కు పొందారు. ఇందులో 90 శాతం మంది 18 ఏళ్లు నిండి 19వ ఏట అడుగు పెట్టినవారేనని అధికారులు పేర్కొంటున్నారు. మిగిలిన వారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఓటును మార్చుకున్నట్లు వివరిస్తున్నారు.

ఈ ఏడాది జనవరిలో పట్టణ ప్రాంత, మార్చిలో గ్రామీణ ప్రాంత ఓటర్ల తుది జాబితాలు విడుదలయ్యాయి. ఆ సమయంలో జిల్లా ఓటర్లు 24.50 లక్షలు. ఆ తర్వాత చాలా మంది ఓటరుగా నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ శాఖలు, పలు స్వచ్ఛంద సంస్థలు ఓటు విలువపై విస్తృతంగా చైతన్యం కల్పించాలి. ఓటరుగా నమోదు చేసుకునేందుకు కళాశాలల్లో ప్రత్యేక క్యాంపులను సైతం నిర్వహించారు. వీటి ఫలితం గానే కొత్తగా ఓటు హక్కు పొందిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. తాజా ముసాయిదా జాబితా ప్రకారం జిల్లా ఓటర్లు 26.56 లక్షలు.
  
అభ్యంతరాల స్వీకరణ.. 
ఓటరు ముసాయిదా జాబితాలపై అభ్యంతరాలు, ఫిర్యాదులకు అవకాశం కల్పించారు. ముసాయిదా ప్రతులను అన్ని గ్రామ పంచాయతీ, తహసీల్దార్‌ కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాల్లో ని (ఆర్‌డీఓ) నోటీస్‌ బోర్డుల్లో అందుబాటులో ఉంచేందుకు యంత్రాంగం ఏర్పా ట్లు చేస్తోంది. కలెక్టరేట్‌ నుంచి ప్రతులను ఆయా ప్రాంతాలకు చేర్చేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబర్‌ 31వ తేదీ వరకు అభ్యంతరాలు తెలిపేందుకు సమయం ఇచ్చారు. ఆ తర్వాత నవంబర్‌ 30 నాటికి వాటిని పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన తుది జాబితా విడుదల చేయనున్నారు. ఈ మధ్యలో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ వెలువడితే తుది జాబితా విడుదల తేదీ మారనున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన 45 రోజుల్లోపు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ సమయంలోనే తుది జాబితాను విడుదల చేస్తారని పేర్కొన్నారు.

నమోదుకు మరోసారి అవకాశం.. 
వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులంతా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాలో ఓటు హక్కు పొందాలంటే జిల్లా పరిధిలో ఏదేని ప్రాంతంలో నివసిస్తూ ఉండాలి. ఆధార్‌ కార్డు తప్పనిసరి కాదు. పుట్టిన తేదీ, నివాస చిరునామా ఉంటే సరిపోతుంది. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, తహసీల్దార్‌ కార్యాలయాల్లో సంప్రదించి ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. లేదంటే మీ–సేవ ద్వారాగాని ఓటు హక్కు పొందవచ్చు. 

అక్టోబర్‌ 31వ తేదీ వరకు అభ్యంతరాలు తెలిపేందుకు సమయం ఇచ్చారు. ఆ తర్వాత నవంబర్‌ 30 నాటికి వాటిని పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన తుది జాబితా విడుదల చేయనున్నారు. ఈ మధ్యలో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ వెలువడితే తుది జాబితా విడుదల తేదీ మారనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top