24 నుంచి ఇంజనీరింగ్‌ చివరి దశ కౌన్సెలింగ్‌ | Final phase of engineering counseling is from July 24th | Sakshi
Sakshi News home page

24 నుంచి ఇంజనీరింగ్‌ చివరి దశ కౌన్సెలింగ్‌

Jul 18 2019 1:38 AM | Updated on Jul 18 2019 1:38 AM

Final phase of engineering counseling is from July 24th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ చివరి దశ కౌన్సెలింగ్‌ నిర్వహణకు ప్రవేశాల కమిటీ షెడ్యూల్‌ ఖరారు చేసింది. ఈ నెల 24 నుంచి చివరి దశ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. ఇప్పటివరకు ఫీజు చెల్లించనివారు ఈ నెల 24 నుంచి 25 లోగా ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని సూచించారు. స్లాట్‌ బుక్‌ చేసుకున్న విద్యార్థులు ఈ నెల 26న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేయించుకోవాలని పేర్కొన్నారు. కొత్త వారితోపాటు మొదటి దశలో సీట్లు రాని వారు, సీట్లు వచ్చినా మరింత మెరుగైన కాలేజీల్లో సీట్ల కోసం ఈ నెల 24 నుంచి 27 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వెల్లడించారు. వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు ఈ నెల 29న సీట్లు కేటాయిస్తామని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 29 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో ట్యూషన్‌ ఫీజు చెల్లించి, సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని తెలిపారు. సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసిన విద్యార్థులంతా 30, 31 తేదీల్లో ఆయా కాలేజీల్లో చేరాలని సూచించారు. 

కాలేజీల్లో చేరిన వారు 40 వేల లోపే.. 
రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఇంజనీరింగ్‌లో 65,444 సీట్లు అందుబాటులో ఉండగా, మొదటి దశ కౌన్సెలింగ్‌లో 49,012 మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. 16 వేలకు పైగా సీట్లు మిగిలిపోయాయి. ఇక సీట్లు పొందిన వారిలో 40 వేల లోపు మంది మాత్రమే కాలేజీల్లో చేరారు. ఫీజు చెల్లింపు, సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు ఇచ్చిన గడువు బుధవారంతో ముగిసింది. దీంతో మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారిలోనూ 9 వేల మందికిపైగా విద్యార్థులు కాలేజీల్లో చేరలేదు. దీంతో చివరి దశ కౌన్సెలింగ్‌లో 26 వేలకు పైగా ఇంజనీరింగ్‌ సీట్లు అందుబాటులోకి రానున్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారులు లెక్కలు వేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement