అకాల వర్షాలకు అన్నదాత కుదేలు 

Farmers Crop loss in 61 thousand acres With Premature Rains - Sakshi

ఇటీవల కురిసిన వర్షాలకు 61 వేల ఎకరాల్లో పంట నష్టం 

అందులో 59 వేల ఎకరాలకు పైగా వరి పంట ధ్వంసం 

20 జిల్లాల్లో 108 మండలాల్లో పంటనష్టం జరిగిందని వ్యవసాయ శాఖ  అంచనా   

సాక్షి, హైదరాబాద్‌: అకాల వర్షాలకు అన్నదాత కుదేలయ్యాడు. ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన పంట నష్టంపై వ్యవసాయ శాఖ సోమవారం ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ నెల 3 నుంచి సోమవారం వరకు రాష్ట్రంలో 20 జిల్లాల్లోని 108 మండలాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. మెదక్, నిర్మల్, జనగాం, నల్లగొండ, యాదాద్రి, సిద్దిపేట, రంగారెడ్డి, నాగర్‌కర్నూలు, రాజన్న సిరిసిల్ల, వరంగల్‌ అర్బన్, మేడ్చల్, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, సూర్యాపేట, ఖమ్మం, కొమురంభీం, భూపాలపల్లి, జగిత్యాల, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఆ జిల్లాల్లో 61,079 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు నివేదిక తెలిపింది. అందులో అత్యధికంగా 59,113 ఎకరాల్లో వరి పంట ధ్వంసమైంది. పెసర, సజ్జ, మొక్కజొన్న పంటలకు కూడా నష్టం వాటిల్లినట్లు తెలిపింది.

సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 12,222 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు నివేదిక వెల్లడించింది. మొత్తంగా 34,347 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని లెక్క తేల్చింది. ఉద్యాన పంటలు దాదాపు 40 వేల ఎకరాల్లో నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. పంట నష్టం జరిగిన రైతులు బీమా కంపెనీల దృష్టికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. 

వడగండ్ల వానలు.. 
సోమవారం ఈదురుగాలులు, వడగండ్ల వానలకు జనగామ జిల్లా  రైతులు అతలాకుతలమయ్యారు.  పొలంలోనే వరిచేను నేలకొరి ధా న్యం రాలిపోయింది. అమ్ముకోవడానికి కొను గోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోయింది. 1,500 ఎకరాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం ఎండపల్లిలో సుమారుగా 250 ఎకరాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్క ఎండపల్లి గ్రామంలోనే సుమారు 250 ఎకరాల పంటకు నష్టం చేకూరింది. కొద్ది రోజుల్లో కోతకు వచ్చే దశలో వడగళ్ల ధాటికి గింజలు పూర్తిగా నేల రాలిపోయాయి.  నష్టపరిహారం అందించాలని బాధిత రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. వ్యవసాయ అధికారి అనూష పంట పొలాల్లో రైతులతో కలిసి పరిశీలించి వివరాలు సేకరించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో సోమవారం ఈదురు గాలులు భీభత్సాన్ని సృష్టించాయి. వరి పంట నేలరాలింది. మామిడికాయలు రాలిపోయా యి. పంట నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు. పెద్దపల్లి జిల్లాలో నాలుగు రోజుల వ్యవధిలో అకాల వర్షాలు రైతులను అతలాకుతలం చేశాయి. గత బుధవారమే భారీ ఈదురుగాలు లు, రాళ్ల వానలతో అతలాకుతలమై  పంట పొలాలు నేలవారగా, మామిడి కాయలు రాలిపోయాయి. మళ్లీ సోమవారం అకాల వర్షం కురవడంతో మార్కెట్‌కు తెచ్చిన ధాన్యం, మిగిలిన వరిపొలాలు, కల్లాల్లో ధాన్యం తడిసింది. రాఘవపూర్, గుర్రాంపల్లి, మారేడుగొండ, రాంపల్లి, హన్మంతునిపేట, నిట్టూరు గ్రామాలతో సుల్తానాబాద్‌ మండలం లో వర్షాలతో పంట దిగుబడులు నష్టపోయా యి. పెద్దపల్లి మండలం ముత్తారం, అప్పన్నపేట, గౌరెడ్డిపేట, రాఘవపూర్‌ల్లో మామిడితోటల కాయలు రాలిపోయాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top