రూ.10 వేలకు మాయరోగం | Fake Medical Certificates in Telangana | Sakshi
Sakshi News home page

రూ.10 వేలకు మాయరోగం

Jun 17 2018 1:57 AM | Updated on Jun 17 2018 1:57 AM

Fake Medical Certificates in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బదిలీలో నచ్చిన స్థానాన్ని దక్కించుకునేందుకు కొందరు ఉపాధ్యాయులు దారి తప్పారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో విద్యాశాఖనే బురిడీ కొట్టించారు. ఇలా ఒకరిద్దరు కాదు.. ఏకంగా రెండు వేలకు పైగా టీచర్లు నకిలీ మెడికల్‌ సర్టిఫికెట్లు సమర్పించి అడ్డదారిలో పాయింట్లు పొందారు. మెడికల్‌ బోర్డుల్లోని అధికారుల చేతులు తడిపి ‘లేని రోగాల’ తో సర్టిఫికెట్లు పొందారు. ధ్రువపత్రాల పరిశీలనలో ఈ వ్యవహారం వెలుగులోకి వస్తోంది. ప్రస్తుతం టీచర్ల దరఖాస్తుల్లో ప్రత్యేక పాయింట్ల కోసం వచ్చిన ధ్రువపత్రాల పరిశీలన జరుగుతోంది. జిల్లా విద్యాశాఖ అధికారి సమక్షంలో జరిగే ఈ పరిశీలనకు ‘ప్రిఫరెన్షియల్‌ కేటగిరీ’కి సంబంధించిన వందలాది టీచర్లు గైర్హాజరవుతున్నారు. ఈ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న వారు తప్పకుండా ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. అయితే కొందరు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో విద్యాశాఖ అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఇందులో నకిలీల బాగోతం బయటపడుతోంది. దరఖాస్తుల పరిశీలనకు ఆయా టీచర్లను ప్రత్యేకంగా పిలిచినప్పటికీ పెద్ద సంఖ్యలో గైర్హాజరు కావడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కొందరు నకిలీ సర్టిఫికెట్‌కు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు వెచ్చించినట్లు ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. 

డబ్బులు కొట్టు.. సర్టిఫికెట్‌ పట్టు 
ప్రిఫరెన్షియల్‌ పాయింట్లకు సంబంధించి పలువురు టీచర్లు దొడ్డిదారిలో సర్టిఫికెట్లు పొందుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బదిలీల ప్రక్రియలో ఈ కేటగిరీకి పది పాయింట్లు ఇస్తారు. దీంతో పలువురు టీచర్లు ఈ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగికి వైకల్యం, కుటుంబ సభ్యులకు దీర్ఘకాలిక వ్యాధులున్న వారు ప్రిఫరెన్షియల్‌ కేటగిరీలోకి వస్తారు. వారు జిల్లా మెడికల్‌ బోర్డు నుంచి ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే ఆ మేరకు పాయింట్లు పొందొచ్చు. దీంతో సీనియార్టీ జాబితాలో ముందు వరుసలోకి రావడంతో నచ్చిన చోట లేదా పట్టణ ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశాలుంటాయి. దీంతో కొందరు మెడికల్‌ బోర్డుల నుంచి నకిలీ ధ్రువీకరణ పత్రాలు పొందారు. బోర్డులోని కొందరు అధికారుల చేతి తడిపి దీర్ఘకాలిక వ్యాధులు, అధిక శాతం వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్లు సంపాదించారు. 

ఏ జిల్లాలో ఎలా..? 
నిజామాబాద్‌ జిల్లాలో గురు, శుక్రవారాల్లో జరిగిన పరిశీలనలో 92 మంది టీచర్లు ప్రిఫరెన్షియల్‌ కేటగిరీ వద్దంటూ అధికారులకు లిఖితపూర్వకంగా లేఖలిచ్చారు. రంగారెడ్డి జిల్లాలో ఏకంగా 30 మంది టీచర్లు పరిశీలనకే రాలేదు. విద్యాశాఖాధికారులు వారికి ఫోన్‌ చేసినా స్పందన రాకపోవడం గమనార్హం. అలాగే కరీంనగర్‌ జిల్లాలో అధికారులు ఏకంగా 185 మంది టీచర్లను ప్రిఫరెన్షియల్‌ కోటాలో అనర్హులుగా తేల్చారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ పెద్ద సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల వైకల్యం తక్కువగా ఉన్నా.. 70 శాతానికి మించినట్లు సర్టిఫికెట్లు సమర్పించినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. మొత్తంగా ఈ కేటగిరీ కింద 2 వేల మంది దరఖాస్తులను తిరస్కరించినట్లు సమాచారం. ప్రిఫరెన్షియల్‌ కేటగిరీలో ఉన్న దరఖాస్తుల పరిశీలనకు జిల్లాస్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement