
వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలకు వీవీప్యాట్‌లు
వచ్చే సాధారణ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)కు ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రెయిల్(వీవీప్యాట్) యంత్రాలను జోడించనున్నట్లు భారత అణుశక్తి సంస్థ చైర్మన్ డాక్టర్ శేఖర్‌బసు వెల్లడించారు.
♦ అప్పటికి 16 లక్షల యంత్రాలు అవసరం
♦ ఈసీఐఎల్‌లో 8 లక్షల యంత్రాల తయారీ
♦ ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యం
♦ అణుశక్తి సంస్థ చైర్మన్ శేఖర్ బసు వెల్లడి
♦ ఘనంగా ఈసీఐఎల్ స్వర్ణోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)కు ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రెయిల్(వీవీప్యాట్) యంత్రాలను జోడించనున్నట్లు భారత అణుశక్తి సంస్థ చైర్మన్ డాక్టర్ శేఖర్‌బసు వెల్లడించారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అధ్యక్షుడు కూడా అయిన ఆయన.. తమ అనుబంధ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) స్వర్ణోత్సవాల సందర్భం గా గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కొందరు ఆరోపిస్తున్నట్లు ఈవీఎంలను ట్యాంపర్ చేయ డం అసాధ్యమని శేఖర్ బసు పునరుద్ఘా టించారు. బ్యాలెట్ పత్రాలు వాడేటప్పుడు కూడా బాక్సులు తారుమారు చేశారన్న ఆరోప ణలు చేసేవారని.. ఈవీఎంల ట్యాంపరింగ్ కూడా అలాంటిదేనని చెప్పారు. ఈ యంత్రాల డిజైనింగ్, తయారీ రెండింటినీ సమర్థంగా నిర్వహిస్తున్న ఈసీఐఎల్.. ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుందని అన్నారు. అయినా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఓటర్లు తాము ఎవరికి ఓటు వేశారో చూసుకునేందుకు అనువుగా వీవీ ప్యాట్‌ను అభివృద్ధి చేశామని, దేశవ్యాప్తంగా 255 నియోజకవర్గాల్లో వీటిని విజయవం తంగా పరీక్షించామని చెప్పారు. ఈ నేపథ్యం లోనే 2019 ఎన్నికలకు అవసరమైన 16.5 లక్షల వీవీప్యాట్ యంత్రాల్లో సగం ఈసీఐఎల్ తయారు చేస్తోందని, వీటితోపాటు మరో 4 లక్షల ఈవీఎంలు 2018 సెప్టెంబర్‌కు సిద్ధమ వుతాయని తెలిపారు.
అణుశక్తి రియాక్టర్లకు సంబంధించిన కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ తయారీ కోసం ఆవిర్భవించిన ఈసీఐఎల్ యాభై ఏళ్లుగా తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తోందని, రానున్న ఏళ్లలో సంస్థ బహుముఖంగా విస్తరించాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. దేశ అణుశక్తి రంగంతోపాటు, భద్రత వ్యవస్థలు, రక్షణ, వైమానిక రంగాలు, ఈ–గవర్నమెంట్ కార్యక్రమాల్లో ఈసీఐఎల్ తనదైన ముద్ర వేసిందన్నారు.
అమెరికా వాళ్లూ అడుగుతున్నారు..
దేశవ్యాప్తంగా ఉన్న నౌకాశ్రయాల్లో రేడియోధార్మిక పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈసీఐఎల్ ఏర్పాటు చేసిన యంత్రాలు తమకూ కావాలని అమెరికా అధికారులు అడుగుతున్నారని ఈసీఐఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దెబాశీష్ దాస్ తెలిపారు. ఈసీఐఎల్ పనితనానికి ఇదో తార్కాణమన్నారు. భద్రతా వ్యవస్థలకు సంబంధించి అనేక అవకాశాలు ఈసీఐఎల్ ముందున్నాయని చెప్పారు.
ఓటింగ్ యంత్రాలతోపాటు వీవీప్యాట్‌లను తయారు చేసేందుకు ఈసీఐఎల్‌లో ఉన్న ఏర్పాట్లను విస్తృతం చేశామని, 60 వేల చదరపు మీటర్ల వైశాల్యమున్న ఫ్యాక్టరీని సిద్ధం చేశామని వివరించారు. ప్రసుత్తం ఈసీఐఎల్ టర్నోవర్ దాదాపు రూ.1,500 కోట్లు ఉండగా.. రానున్న రెండేళ్లలో ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల ఆర్డర్ విలువ దాదాపు రూ.1,900 కోట్ల వరకూ ఉందని తెలిపారు.