
అచ్చంపేట : మారుమూల ప్రాంత పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర పోస్టులను భర్తీ చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతలలో పది పడకల అస్పత్రిని 30 పడకలుగా ఆప్‌గ్రేడ్ చేసే పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నల్లమలలో సంచార పాతోలాజికల్ లేబరేటరీ (మొబైల్ వ్యాన్)ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే ట్రామా, కేన్సర్ డిటెక్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. అచ్చంపేటలో వంద పడకల ఆస్పత్రి రూపుదిద్దుకుంటోందన్నారు.