తప్పు చేస్తే ఎవరినీ వదలం: ఎర్రబెల్లి

Errabelli Dayakar rao Attended Mulugu ZPTC Chairman Oath Ceremony - Sakshi

సాక్షి, ములుగు: తప్పు చేస్తే సర్పంచ్‌ అయినా ఊరుకునేది లేదని పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. బుధవారం ములుగు జిల్లా పరిషత్ చైర్మన్‌గా కుసుమ జగదీష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేయడానికి గ్రామ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. గతంలో జిల్లాపాలక వర్గాలకు అధికారం, నిధులు ఏవీ లేకుండా పోయాయని, దీనివల్ల గ్రామీణ పాలన దెబ్బతిందని పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామ అభివృద్ధి కమిటీ, జిల్లా పరిషత్‌లకు అధికారాలు ఇచ్చిందని ఎర్రబెల్లి గుర్తు చేశారు. అదే విధంగా సర్పంచ్‌కు, ఎంపీపీకి కూడా నిధులివ్వటం ద్వారా స్థానిక సంస్థల ప్రతినిధుల చేతిలోకి పాలన వ్యవస్థను తీసుకొస్తున్నామని తెలిపారు. సర్పంచ్‌లను ఉద్దేశిస్తూ..  అధికారాలు మీ చేతుల్లోనే ఉన్నాయని, ఇంకా చెక్‌పవర్‌పై రాద్దాంతం చేయవద్దని సూచించారు. ప్రజాప్రతినిధులు ఎవరు తప్పు చేసినా సహించేది లేదని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top