గుప్తనిధుల కోసం నరబలికి యత్నం


 వెల్దుర్తి : గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు చేస్తూ మేక పిల్లను బలిచ్చి, నరబలి కోసం యువకుడిని సన్నద్ధం చేస్తున్న తరుణంలో ప్రజలు అడ్డుకుని మంత్రగాళ్లను చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మండలంలోని నెల్లూర్ గ్రామ శివారు హల్దీవాగు ఒడ్డున ఉన్న చెట్ల పొదల్లో గురువారం తెల్లవారుజామున వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.



బుధవారం అర్ధరాత్రి నుంచి హల్దీవాగు ఒడ్డున గ్రామానికి చెందిన పిట్ల కిషన్, ఆయన భార్య లక్ష్మి, అతడి సోదరులైన శివ్వంపేట మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన పిట్ల రామ్మోహన్, పిట్ల నరేందర్, అదే గ్రామానికి చెందిన పుల్లెర అశోక్, వెల్దుర్తి పంచాయతీ ఎలుకపల్లి గ్రామానికి చెందిన మంద సత్తయ్య, మెదక్‌కు చెందిన భార్యాభర్తలు కుంట నరసింహులు, సువర్ణ, వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్, చిన్నశంకరంపేట మండలం సూరారానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు క్షద్రపూజలు చేస్తూ జంతుబలినిచ్చారు.



ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన రైతులు పలువురు తమ పొలాలకు నీరు కట్టేందుకు అటు వెళుతూ ఈ విషయాన్ని పసిగట్టారు. సమీపంలోకి వెళ్లి చూడగా బలి ఇచ్చిన మేక పిల్ల, పసుపు, కుంకుమ, కారం, నూనె, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అగరొత్తులు చూసి క్షుద్రపూజలు చేస్తున్నట్లు గుర్తించారు. అయితే నరబలికి కూడా సిద్ధం చేస్తున్నట్లు గుర్తించిన వారు విషయాన్ని గ్రామస్తులకు సమాచారం అందించారు. ప్రజలు అక్కడికి చేరుకునే లోపు మెదక్‌కు చెందిన నరసింహులు, ఉప్పులింగాపూర్, సూరారం గ్రామాలకు చెందిన మరో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు.



 మిగిలిన వారిని గ్రామస్తులు పట్టుకుని వచ్చి పాత పంచాయతీ కార్యాలయంలో బంధించారు. అయితే అప్పటికే పరారై కిషన్ ఇంట్లో దాగి ఉన్న మంద సత్తయ్యను గ్రామస్తులు బయటకు తీసుకువచ్చి చితకబాదుతూ పంచాయతీ గదికి తీసుకువచ్చారు. అనంతరం పోలీసులకు సమాచారం అందిచడంతో వారు వచ్చి వీరిని పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. నిందితులను ఇక్కడ శిక్ష  వేయాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు వారికి నచ్చజెప్పి నిందితులను స్టేషన్‌కు తరలించారు. అయితే గ్రామస్తుల చేతిలో చావుదెబ్బలు తిన్న వారికి తీవ్రగాయాలు కావడంతో వారికి మెదక్ ఆస్పత్రికి తరలించారు. విచారణ చేపడుతున్నామని ఏఎస్‌ఐ మహ్మద్ పాషా తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top