సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి నిధుల గ్రహణం

Delay In  adilabad Super Speciality Hospital works Due To Funds Delay - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: అడవి బిడ్డల నిలయమైన ఆదిలాబాద్‌ జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటవుతుందనగానే అందరూ హర్షం వ్యక్తం చేశారు. మారుమూల జిల్లాగా పేరుగాంచిన ఆదిలాబాద్‌లో ఆస్పత్రి నిర్మాణం జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. అలాంటిది దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గిరిజనులకు వైద్యసేవలు అందించాలనే  మహోన్నత ఆశయంతో 2008లో ఆసుపత్రి ఏర్పాటుకు పూనుకున్నారు. ఇప్పటికే ఈ వైద్య కళాశాల ద్వారా ఆరు ఎంబీబీఎస్‌ బ్యాచ్‌లు పూర్తయ్యాయి. తాజాగా ఈ కళాశాలకు 20 సీట్లతో పీజీ కోర్సు కూడా మంజూరైంది. రిమ్స్‌ వైద్య కళాశాలకు అనుబంధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ హస్పిటల్‌ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. 

రూ.150 కోట్లతో.. 
ప్రధానమంత్రి స్వస్థి సురక్ష యోజన (పీఎంఎస్‌ఎస్‌వై) మూడో దశలో ఆదిలాబాద్‌ జిల్లా రిమ్స్‌కు 210 పడకలతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరైంది. రిమ్స్‌ వైద్య కళాశాల ఎదురుగా ఉన్న 3.42 ఎకరాల ఆసుపత్రి స్థలంలోనే రూ.150 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ ఆస్పత్రి వ్యయంలో రూ.120 కోట్లు కేంద్ర ప్రభుత్వం, రూ.30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. ఇందులో భవన నిర్మాణం కోసం రూ.77.58 కోట్లు వెచ్చిస్తుండగా, మెడికల్‌ ఫర్నీచర్, మౌలిక సదుపాయాలు, పరికరాల కోసం మిగితా నిధులను ఉపయోగించనున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన కేఎంవీ ప్రాజెక్టు లిమిటెడ్‌కు ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీ కింద పనులను అప్పగించారు. ఆ ఏజెన్సీ ఈ పనులను హెచ్‌ఎల్‌ఎల్‌ ఇన్‌ఫ్రాటెక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌కు అప్పగించింది. 

గడువు దాటినా.. 
సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన కోసం 80–20 శా తం వాటాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయాలి. 2016 జూలై 16న భవన ని ర్మాణ పనులు ప్రారంభమై, 2018 జనవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గడువు పూర్తయినప్పటికీ పనులు మాత్రం పూర్తి కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి భవన నిర్మాణం కోసం రూ.15 కోట్లు రావాల్సి ఉండగా మంజూరు చేయకపోవడంతో పనులు పూర్తి చేయడంలో ఆలస్యం జరుగుతున్నట్లు చెబుతున్నారు.  

పరికరాలు వచ్చేశాయ్‌.. 
సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే.. న్యూరాలజీ, న్యూరోసర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంట్రోలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ, కార్డియాలజీ, సీటీవీఎస్‌కు సంబంధించి వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. పైన పేర్కొన్న వైద్య సేవల కొరకు హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహారాష్ట్రలోని నాగ్‌పూర్, యావత్‌మాల్‌ ప్రాంతాలకు వెళ్లాల్సి రావటంతో వైద్యం ఖర్చుతో పాటు రవాణా ఖర్చులు కూడా తడసి మోపెడవుతున్నాయి. తద్వారా పేద ప్రజల జేబుకు చిల్లు పడుతోంది.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top