‘దేశ ప్రజలకు ఎందుకు కాపలాగా లేరు’

CPM National Secretary Seetha Ram Yechury Speaks AT Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం: కేంద్రంలోని బీజేపీని అధికారంలో నుంచి దించకపోతే మానవ హక్కులను కాపాడుకోలేమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ప్రజలను దోపిడీ నుంచి కాపాడాలని,  బీజేపీ పాలనలో దళితులు, గిరిజనుల మీద దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తంచేశారు. పుల్వామా ఉగ్రదాడి ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.

శుక్రవారం ఖమ్మంలో జరిగిన ఓ సమావేశంలో ఏచూరి మాట్లాడుతూ.. వామపక్షాలు, లౌకిక శక్తులను పార్లమెంట్‌కు పంపాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలన్ని ఎన్నికలు ముందు విడివిడిగానే పోటీ చేస్తాయని, కానీ అధికారం కోసం ఎన్నికల అనంతరం కలుస్తాయని అన్నారు. ప్రజలు మంచి తీర్పునిస్తే.. కేంద్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాపలదారుడిని అని చెప్పుకునే నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు ఎక్కడ రక్షణగా ఉన్నారని ప్రశ్నించారు.

దుర్మార్గ పాలనకు చరమగీతం: తమ్మినేని
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించి దుర్మార్గమైన పాలనకు చరమగీతం పాడాలని సీపీఎం కేంద్ర కార్యవర్గ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ప్రజలగొంతుకను వినిపించేందుకు పార్లమెంట్‌లో వామపక్షాల బలం పెంచాలన్నారు. కేంద్రంలో లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌ పేరుతో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేస్తోందని మండిపడ్డారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఫిరాయించడం మంచిదికాదన్నారు. దేశంలో వామపక్షాల అవసరం ఎంతో ఉందన్న తమ్మినేని.. సీపీఎం, సీపీఐ ఐక్యంగా పోటీచేస్తాయని వెల్లడించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top