తాగునీటి శుద్ధికి జనుము + రాగి!

Copper can be used to kill microorganisms such as bacteria and viruses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తాగునీటిలో హానికారక సూక్ష్మజీవుల చేరికను నిరోధించేందుకు ఐఐటీ మద్రాస్‌ శాస్త్రవేత్తలు వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. చౌకగా అందుబాటులో ఉండే జనపనారకు రాగిపూత పూసి వాడటం ద్వారా తాగునీటి కాలుష్యాన్ని అడ్డుకోవచ్చునని, తద్వారా కలుషిత నీటితో వచ్చే వ్యాధులను నివారించవచ్చునని వీరు చెబుతున్నారు. బిందెలు, కుండల్లో నీటిని నిల్వ చేసుకుని తాగడం మనమందరం చేసే పనే. అయితే ఇలా నిల్వచేసిన నీటిలో బ్యాక్టీరియా, వైరస్‌ వంటి సూక్ష్మజీవులు ఉత్పత్తయ్యే అవకాశాలెక్కువ. ఈ సూక్ష్మజీవుల వల్ల కలరా, మలేరియా, టైఫాయిడ్, అతిసార వంటి అనేక రోగాలు వస్తాయి. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నీటిని కాచి వడబోసి వాడాలని చెబుతారు. కానీ నీటిని కాచేందుకు ఎంతో కొంత ఖర్చవుతుంది. పైగా పర్యావరణానికీ అంత మంచిది కాదు. పోనీ రివర్స్‌ ఆస్మాసిస్‌ వంటి టెక్నాలజీలను వాడే వాటర్‌ ఫిల్టర్లను కొందామా? అంటే చాలామంది ఈ ఖర్చు భరించలేరు. వీటితో నీటివృథా కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలో వీలైనంత చౌకగా నీటిని శుద్ధిచేసే లక్ష్యంతో మద్రాస్‌ ఐఐటీలోని రసాయన శాస్త్ర విభాగం శాస్త్రవేత్త డాక్టర్‌ దిలీప్‌కుమార్‌ చాంద్‌ ప్రయోగాలు చేపట్టారు. 

జనుము, రాగితో మెరుగైన ఫలితాలు 
బ్యాక్టీరియా, వైరస్‌ వంటి సూక్ష్మజీవులను చంపేందుకు రాగి భేషుగ్గా ఉపయోగపడుతుందని మనకు తెలుసు. రాగి చెంబు లేదా గ్లాస్‌లో ఉంచిన నీటిని తాగడం కూడా ఇందుకే. అయితే ఒక పరిమితి దాటాక రాగితో మనిషికి ప్రమాదం ఏర్పడవచ్చునని, అది నీటిలోకి చేరకుండా చూసుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్‌ దిలీప్‌కుమార్‌ చాంద్‌ తెలిపారు. రాగిని మెరుగ్గా వాడేందుకు తాము చేసిన పరిశీలనల్లో జనుము గురించి తెలిసిందని, చౌకగా లభించడం, నీటిపై తేలియాడే లక్షణం కారణంగా దీన్ని ఎంపిక చేశామని ఆయన చెప్పారు. జనుమును చిన్నచిన్న పూసల్లా చేసి దానిపై కుప్రస్‌ ఆక్సైడ్‌ లేదా రాగిని పూతగా పూసి నీటిని నిల్వ ఉంచిన పాత్రలో వేస్తే వాటిల్లో సూక్ష్మజీవులు అసలు ఉత్పత్తి కాలేదని ప్రయోగపూర్వకంగా గుర్తించామని చెప్పారు. సాధారణ నీటితో పోల్చినప్పుడు ఐదు రోజుల తరువాత కూడా రాగితో కూడిన జనుము పూసలు ఉన్న నీటిలో బ్యాక్టీరియా అతి తక్కువగా పెరిగిందని తెలిపారు. ఈ ప్రయోగాల్లో ఐఐటీ మద్రాస్‌ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ఎన్‌.గుమ్మడి సత్యనారాయణ, రణధీర్‌ రై కూడా పాల్గొన్నారు. పరిశోధన వివరాలు ఏసీఎస్‌ ఒమేగా జర్నల్‌ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top