సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆదేశాల నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేందుకు కసరత్తు వేగిరం చేసింది. ఇప్పటికే పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక జిల్లా కమిటీల నుంచి అభిప్రాయాలు కోరిన టీపీసీసీ తాజాగా పోటీ చేయాలని అనుకునే అభ్యర్థులెవరైనా ఈ నెల 10 నుంచి 12 వరకు పార్టీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 10 నుంచి 12 వరకు మూడ్రోజుల పాటు గాంధీభవన్‌లో ఆసక్తి ఉన్న వారు పూర్తి బయోడేటాతో దరఖాస్తు చేసుకోవాలని అందులో తెలిపారు. ఇప్పటికే ప్రదేశ్ ఎన్నికల కమిటీని ప్రకటించిన నేపథ్యంలో సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నామని వెల్లడించారు. ప్రదేశ్ ఎన్నికల కమిటీ దరఖాస్తులను పరిశీలించి ఏఐసీసీకి నివేదిక సమర్పించనున్నట్లు ఉత్తమ్ వివరించారు.
11, 12 తేదీల్లో పార్టీ కమిటీల భేటీలు..
ఇక పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేసేందుకు 11, 12 తేదీల్లో అన్ని పార్టీ కమిటీలతో చర్చిం చాలని టీపీసీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా 11న ఉదయం 11 గంటలకు అన్ని జిల్లాల కొత్త పార్టీ అధ్యక్షులు, ఒంటిగంటకు మీడియా కో ఆర్డినేషన్ కమిటీ, మధ్యాహ్నం 2.30 గంటలకు పబ్లిసిటీ కమిటీ, 4 గంటలకు ప్రచార కమిటీ, 5.30 గంటలకు సమన్వయ కమిటీలతో భేటీ నిర్వహించనుంది. 12న ఎన్నికల కమిటీ భేటీ ఉండనుంది. వీటిల్లో అభ్యర్థుల ఎంపిక మొదలు, ప్రచార వ్యూహాలను టీపీసీసీ సిద్ధం చేయనుంది.


