కాంగ్రెస్‌లో... మిగిలింది ఒక్కరే!

Congress Party Have One MLA In Rangareddy District - Sakshi

ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ ఖాళీ

తాండూరు నుంచి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఒక్కరే ప్రాతినిథ్యం

గులాబీ ఆకర్ష్‌కు హస్తం బేజారు 

మాజీ మంత్రి సబితారెడ్డి వెనుక భారీగా అనుచరగణం, నేతలు 

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ దాదాపుగా ఖాళీ అయింది. ఆ పార్టీ నుంచి కేవలం తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాత్రమే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గులాబీగూటికి చేరుతున్నట్లు ఇటీవల మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.   ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సైతం అదేదారిలో పయనిస్తున్నారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌కు అధికార పార్టీ పదును పెట్టడంతో ‘హస్తం’ కుదేలవుతోంది. తమ ఎమ్మెల్యేలు ‘కారు’లోకి ఎక్కకుండా ఆ పార్టీ అధిష్టానం ఎంత ప్రయత్నించినా ఫలితం ఏమాత్రం కనిపించడం లేదు. తమ నియోజకవర్గాల అభివృద్ధికి, సీఎం కేసీఆర్‌ పనితీరుకు ఆకర్షితులై గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

సాక్షి, తాండూర్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీని మరింత బలోపేతం చేసి ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ సీట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దృష్టి సారించారు. ఈమేరకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఆపరేషన్‌  ఆకర్షను అమలు చేయడంతో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా గులాబీ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్‌ పార్టీ నేతలంతా కారు ఎక్కేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈక్రమంలో ఇటీవల మాజీ హోంమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తన కుమారులతో కలిసి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తోపాటు ఎంపీ కవిత, సీఎం కేసీఆర్‌ను కలిశారు. త్వరలో చేవెళ్లలో జరిగే సభలో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలోని ఆమె అనుచరులు, ముఖ్యకార్యకర్తలు సైతం గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. అదేవిధంగా ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సైతం సబితారెడ్డిని అనుసరించనున్నారు. ఆయన కూడా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  

టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో బాగున్నాయని, తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం పార్టీ వీడుతున్నట్లు వీరు చెబుతున్నారు. ఈనేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో 13 స్థానాలు టీఆర్‌ఎస్‌ ఖాతాలో చేరనున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో ఇక మిగిలింది తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్‌రెడ్డి మాత్రమే. ఆయన 5 నెలల క్రితమే పార్టీలో చేరి ఎమ్మెల్యే టికెట్‌ దక్కించుకొని మాజీ మంత్రి మహేందర్‌రెడ్డిపై పోటీ చేసి విజయం సాధించారు. అనతి కాలంలోనే ఆయన డీసీసీ పదవి దక్కించుకున్నారు. పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు ‘చే’జారడంతో హస్తం అధినాయకత్వం సతమతమవుతోంది. పార్టీలో ఉన్న నేతలు, కార్యకర్తలను కాపాడుకునే పనిలో బిజీగా ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top