తుది అంకం | Sakshi
Sakshi News home page

తుది అంకం

Published Fri, Nov 9 2018 4:18 PM

 congress final list candidates - Sakshi

తొలిజాబితాలో వీరికి..
శనివారం విడుదల చేసే తొలి జాబితాలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(మహేశ్వరం), టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, రేవంత్‌రెడ్డి 
(కొడంగల్‌), తాజా మాజీ ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి (పరిగి), వంశీచంద్‌రెడ్డి (కల్వకుర్తి), మాజీ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి 
(ఎల్‌బీనగర్‌), ప్రతాపరెడ్డి (షాద్‌నగర్‌), కూన శ్రీశైలంగౌడ్‌ (కుత్బుల్లాపూర్‌) పేర్లు ఉండే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, బహుళ 
పోటీ నెలకొన్న ఇబ్రహీంపట్నం, మేడ్చల్, చేవెళ్ల నియోజకవర్గాలను పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. కాగా, టీడీపీ అడుగుతున్న శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఉప్పల్, రాజేంద్రనగర్‌ సహా టీజేఎస్‌ ప్రతిపాదిస్తున్న మల్కాజిగిరిని పక్కనపెట్టినట్లు సమాచారం. వికారాబాద్‌ సెగ్మెంట్‌ విషయంలో సోనియా నేతృత్వంలోని సీఈసీ సమావేశంలో ప్రత్యేక చర్చ జరిగినట్లు తెలిసింది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: 
కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా కూర్పు తుది అంకానికి చేరింది. ఈ నెల పదో తేదీన తొలి జాబితా విడుదల చేయాలని నిర్ణయించిన ఆ పార్టీ.. పోటీ తీవ్రంగా నెలకొన్న నియోజకవర్గాలను పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. మూడు రోజులుగా జాబితా వడపోతపై కసరత్తు చేసిన స్క్రీనింగ్‌ కమిటీ.. గెలుపుగుర్రాల ఎంపికలో సామాజిక సమీకరణలు, సమర్థతను పరిగణనలోకి తీసుకుంటోంది. పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లోని ఆశావహులను ఢిల్లీకి పిలిపించి బుజ్జగింపులు చేస్తోంది. కాగా, ఒకరే ఆశిస్తున్న నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇందులో మహేశ్వరం, కల్వకుర్తి, కొడంగల్, పరిగి, ఎల్‌బీనగర్, షాద్‌నగర్‌ స్థానాలున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల జాబితా వెల్లడిలో జరుగుతున్న జాప్యంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. 
బుజ్జగింపులతో దారికి.. 
ఇద్దరు, ముగ్గురు పొటీపడుతున్న నియోజకవర్గాల్లో పార్టీకి నష్టం జరగకుండా ఏఐసీసీ జాగ్రత్తపడింది. ఇలా పోటీ తీవ్రంగా ఉన్న సెగ్మెంట్ల ఆశావహులతో సంప్రదింపులు జరిపింది. ప్రత్యర్థుల బలాబలాలు, సామాజికవర్గాల సమతుల్యతల కారణంగా టికెట్‌ దక్కకపోయినా.. కలిసికట్టుగా పనిచేయాలని మార్గనిర్దేశం చేసింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్‌/ఎమ్మెల్సీ తదితర పదవులతో సముచిత గౌరవం కల్పిస్తామని భరోసా ఇచ్చింది. అసమ్మతి చల్లారినట్లేనని భావించిన నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన స్క్రీనింగ్‌ కమిటీ.. ఇంకా వివాదాస్పదంగా ఉన్నట్లు గుర్తించిన వాటిని మాత్రం పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.  ఆశావహుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న ఇబ్రహీంపట్నం, తాండూరు, మేడ్చల్, రాజేంద్రనగర్, వికారాబాద్‌ నియోజకవర్గాల నేతలతో హైకమాండ్‌ మాట్లాడింది. కొన్ని స్థానాల నుంచి ఒకరికే ఆహ్వానం పలకడం.. మరికొన్ని చోట్ల ఇద్దరిని పిలిపించి మాట్లాడడంతో టికెట్‌ ఎవరికిస్తున్నారో.. ఎవరిని బుజ్జగిస్తున్నారో ఆర్థం కావడం లేదు.

సబిత డుమ్మా.. చంద్రశేఖర్‌ హాజరు 
అభ్యర్థుల ఖరారులో ప్రతిష్టంభన తొలగించేందుకు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, చంద్రశేఖర్‌ను హస్తినకు రావాలని స్క్రీనింగ్‌ కమిటీ వర్తమానం పంపింది. ఈ మేరకు చంద్రశేఖర్‌ కమిటీ ఎదుట హాజరై వికారాబాద్‌ స్థానంపై తన వాదన వినిపించారు. ఈ స్థానాన్ని మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ కూడా ఆశిస్తుండగా.. చేవెళ్ల సీటును స్క్రీనింగ్‌ కమిటీ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలావుండగా,  సబిత మాత్రం ఢిల్లీకి వెళ్లకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహేశ్వరంతోపాటు తన కుమారుడు కార్తీక్‌రెడ్డి రాజేంద్రనగర్‌ సీటును ఆశిస్తున్నారు. అయితే, కుటుంబానికి ఒకే టికెట్‌ నిబంధన ఉన్నందున ఈ అంశంపై ఆమెతో మాట్లాడాలని అధిష్టానం భావించినట్లు తెలిసింది.

ఇబ్రహీంపట్నం టికెట్‌ రేసులో ఉన్న మల్‌రెడ్డి బ్రదర్స్, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డితో కూడా స్క్రీనింగ్‌ కమిటీ చర్చించింది. ఎవరికి టికెట్‌ ఇచ్చినా.. సమన్వయంతో పనిచేయాలని, టికెట్‌ దక్కనివారికి భవిష్యత్తులో తగిన ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. అలాగే, మేడ్చల్‌ టికెట్‌ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్, రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌ గూటికి చేరిన తోటకూర జంగయ్యయాదవ్‌తో ఒకేసారి మాట్లాడి.. దిశానిర్దేశం చేసింది. రాజేంద్రనగర్‌పై కన్నేసిన సినీ నిర్మాత బండ్ల గణేశ్‌తో కూడా స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు చర్చించారు. తాండూరు సీటుకు పోటీపడుతున్న పైలెట్‌ రోహిత్‌రెడ్డి, లక్ష్మారెడ్డిలకు హితోపదేశం చేసిన కమిటీ.. ఎవరికి టికెట్‌ వచ్చినా కలిసికట్టుగా పనిచేయాలని సూచించింది.  

Advertisement
Advertisement