దరఖాస్తుపై అయోమయం  | Confusion For Applicants Regarding Gurukula Principal Recruitment | Sakshi
Sakshi News home page

దరఖాస్తుపై అయోమయం 

Feb 27 2020 3:20 AM | Updated on Feb 27 2020 3:20 AM

Confusion For Applicants Regarding Gurukula Principal Recruitment - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రిన్సిపాల్‌ ఉద్యోగాల నియామకాలపై అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. గత నెల 14న ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీలో 19 ప్రిన్సిపాల్‌ పోస్టులకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ విడుదలయ్యాక ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 20న కొత్తగా ఎస్టీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో మరో 15 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. గత నెలలో జారీ చేసిన నోటిఫికేషన్‌లోనే కొత్త పోస్టులను కలుపుతూ ఎస్సీ, ఎస్టీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 34 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వడంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించేందుకు మార్చి 20 వరకు గడు వును నిర్దేశించింది. అయితే తొలుత జారీ చేసిన నోటిఫికేషన్‌ ఆధారంగా దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి ఏమిటనే దానిపై బోర్డుకు వినతులు వెల్లువెత్తుతున్నాయి. మొదటి నోటిఫికేషన్‌ ప్రకారం ఎస్సీ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న వారు కొత్తగా ఎస్టీ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌ పోస్టుకు కూడా దరఖాస్తు చేసుకోవాలా అనే అం శంపై స్పష్టత లేక అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. 

ఆప్షన్లు మార్చుకుంటే సరి... 
గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రిన్సిపాల్‌ ఉద్యోగాల దరఖాస్తుపై గురుకుల బోర్డు స్పష్టత ఇచ్చింది. అభ్యర్థుల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన యంత్రాంగం.. ఆప్షన్లు మార్చుకునే వెసులుబాటు కల్పించింది. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి యూజర్‌ ఐడీ ద్వారా లాగిన్‌ అయ్యాక ఆప్షన్లు మార్చుకోవాలని సూచిస్తూ వివరాలను గురుకుల బోర్డు వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. మొత్తం 34 కాలేజీల్లో ప్రిన్సిపాల్‌ పోస్టులు భర్తీ చేస్తుండగా.. ఇందులో 5 పోస్టులు జనరల్‌ కాలేజీలు కాగా... మిగతా 29 మహిళా డిగ్రీ కాలేజీలు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement