‘గురుకుల’ పోస్టుల విభజనకు కమిటీ 

Committee to replacement of Gurukul posts if clarity comes - Sakshi

సీనియర్‌ అధికారులతో ఏర్పాటు 

పరిశీలన తర్వాత ప్రభుత్వానికి నివేదిక  

స్పష్టత వస్తే గురుకుల పోస్టుల భర్తీ వేగవంతం 

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల పాఠశాలలకు మంజూరు చేసిన పోస్టుల భర్తీకి గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) చర్యలు చేపట్టింది. అయితే, రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చిన కొత్త జోనల్‌ విధానం ప్రకారం పోస్టులను విభజించాల్సి ఉంది. జిల్లా, జోనల్, మల్టీ జోనల్‌ స్థాయి పోస్టులేమిటనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. పోస్టుల విభజనపై ఇటీవల గురుకుల నియామకాల బోర్డు ప్రభుత్వాన్ని వివరణ కోరగా మీరే తేల్చుకుని వివరాలివ్వాలని సూచించింది. ఈ క్రమంలో పోస్టుల విభజనపై గురుకుల నియామకాల బోర్డు ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది.

గురుకుల విద్యాసంస్థల సొసైటీల నుంచి ఎనిమిది మంది సీనియర్‌ అధికారులను ఇందులో నియమించింది. ఉద్యోగాల కేటగిరీ, వర్క్‌ పర్‌ఫార్మెన్స్, పేస్కేల్‌ తదితర అంశాలను ప్రాతిపదికన తీసుకుని పోస్టుల విభజన చేసేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న అన్ని కేటగిరీలతోపాటు సొసైటీ కార్యాలయాలు, రీజినల్‌ కార్యాలయాల్లోని ఉద్యోగుల సమాచారాన్ని కమిటీ సేకరించి పరిశీలిస్తోంది. పోస్టుల విభజనపై నివేదికను రూపొందించిన తర్వాత ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు గురుకుల నియామకాల బోర్డు కన్వీనర్‌ నవీన్‌ నికోలస్‌ ‘సాక్షి’తో అన్నారు. 

విభజన పూర్తయితేనే కొత్త నియామకాలు 
కొత్త జోనల్‌ విధానం అందుబాటులోకి రావడంతో పోస్టుల విభజన అనివార్యమైంది. దీంతో పోస్టుల విభజన అంశాన్ని పలు శాఖలు ప్రభుత్వానికి వదిలేశాయి. అయితే, గురుకుల పాఠశాలల్లో కొత్త పోస్టులను ప్రభుత్వం మంజూరు చేస్తున్న తరుణంలో సొసైటీ పరిధిలోని పోస్టులను విభజించేందుకు గురుకుల బోర్డు చర్యలు చేపట్టింది. సొసైటీకి ప్రత్యేక సర్వీసు నిబంధనలు ఉండటంతో ఆ మేరకు పోస్టులు విభజించొచ్చనే భావనతో గురుకులబోర్డు చర్యలు వేగవంతం చేసింది. దీంతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి పరిశీలన పూర్తిచేయాలని ఆదేశించింది. వారంలోగా కమిటీ నివేదిక వచ్చే అవకాశం ఉంది. అనంతరం ప్రభుత్వానికి సమర్పించి ఆమోదింపజేసుకోవచ్చని అధికారులు యోచిస్తున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top