వైద్యుల నిర్లక్ష్యం.. నిరుపేదకు 8 లక్షల పరిహారం 

Civil Supplies And Consumer Department Of State Govt Helps Man - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వినియోగదారుల సహాయ కేంద్రం ఓ బాధితుడికి అండగా నిలిచింది. డాక్టర్ల నిర్లక్ష్యంతో ఆపరేషన్‌ వికటించి ఉపాధి కోల్పోయి తీవ్ర అనారోగ్యానికి గురైన యోగా మాస్టర్‌కు రూ.8 లక్షలు నష్టపరిహారం ఇప్పించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తపల్లికి చెంది న పి.దేవయ్య(31) యోగా శిక్షకుడు. జాతీయ పోలీసు అకాడమీలో కూడా పనిచేశారు. యోగాలో అంతర్జాతీయస్థాయిలో కాంస్య పతకం సాధించాడు. 2018 ఫిబ్రవరి 24 సికింద్రాబాద్‌లోని పైల్స్‌ క్లినిక్‌లో రూ.25 వేల ప్యాకేజీతో లేజర్‌ ట్రీట్‌మెంట్‌ చేయించుకున్నాడు. డిశ్చార్జి అయిన తర్వాత రక్తస్రావం కావడంతో మరుసటిరోజు అదే క్లినిక్‌లో సంప్రదించాడు. దీంతో యశోదా హాస్పిటల్‌కు వెళ్లాలని వైద్యులు రిఫర్‌ చేశారు.

చికిత్స కోసం పెద్దమొత్తంలో డబ్బులు అవసరమని డాక్టర్లు చెప్పడంతో దేవయ్య కుటుంబసభ్యులు, సన్నిహితులు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసి డెంట్‌ కేటీఆర్‌ను సంప్రదించారు. ఆయన స్పందించి రూ.5.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు చేయించారు. కానీ, నెలన్నర పాటు యశోద హాస్పిటల్‌లో చికిత్స చేసుకున్న దేవయ్యకు మొత్తం రూ.18 లక్షల ఖర్చు అయింది. మిగతా డబ్బుల కోసం తనకున్న కొద్దిపాటి భూమిని అమ్మి, మరికొంత అప్పు చేసి హాస్పిటల్‌ బిల్లు చెల్లించారు. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత పైల్స్‌ క్లినిక్‌పై తెలంగాణ వినియోగదారుల సహాయకేంద్రాన్ని ఆశ్రయించారు. సహాయ కేంద్రం నిర్వాహకులు హాస్పిటల్‌ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి ఇరవై రోజుల్లో కేసును పరిష్కరించి దేవయ్యకు రూ.8 లక్షల నష్టపరిహారం ఇప్పించారు. ఈ చెక్కును పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ ఆదివారం దేవయ్యకు అందజేశారు.  

న్యాయం జరిగింది: దేవయ్య 
‘తీవ్ర అనారోగ్యానికి గురై, ఉపాధి కోల్పోయిన నాకు కేటీఆర్, వినియోగదారుల సహాయ కేంద్రం అండగా నిలిచింది. ఆపరేషన్‌ విషయంలో నిర్లక్ష్యం చేసిన హాస్పిటల్‌ నుంచి రూ.8 లక్షల నష్టపరిహారం ఇప్పించారు. ఉచితంగా ఇరవై రోజుల్లోనే సమస్యను పరిష్కరించి తనకు న్యాయం చేశారు’అని దేవయ్య తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top