నిర్లక్ష్యపు జాడ్యం.. ప్రాజెక్టులకు శాపం! | CAG raps govt for bungling in 13 lift irrigation projects | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యపు జాడ్యం.. ప్రాజెక్టులకు శాపం!

Mar 28 2017 3:52 AM | Updated on Nov 9 2018 5:56 PM

నిర్లక్ష్యపు జాడ్యం.. ప్రాజెక్టులకు శాపం! - Sakshi

నిర్లక్ష్యపు జాడ్యం.. ప్రాజెక్టులకు శాపం!

పలు సాగునీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అనుమతుల విషయంలో తీవ్ర జాప్యంతో.. వాటి నిర్మాణ పనులు నత్తనడకన నడుస్తున్నాయని కంప్ట్రోల ర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌

సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ తీరును ఎండగట్టిన కాగ్‌
ఆదిలాబాద్‌లోని ఐదు మధ్యతరహా ప్రాజెక్టుల్లో తీవ్ర జాప్యం
52 వేల ఎకరాల లక్ష్యంలో 13,900 ఎకరాలకే నీళ్లు ఇచ్చారు
తప్పుడు నిర్ణయాలతో కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ధి
దేవాదుల మూడో దశలో కాంట్రాక్టర్‌కు అదనంగా రూ.4.74 కోట్లు  


సాక్షి, హైదరాబాద్‌: పలు సాగునీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అనుమతుల విషయంలో తీవ్ర జాప్యంతో.. వాటి నిర్మాణ పనులు నత్తనడకన నడుస్తున్నాయని కంప్ట్రోల ర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ఎత్తి చూపిం ది. నీటి లభ్యతను, గ్రామాల వారీ ఆయకట్టు ప్రణాళికను సరిగా అంచనా వేయకపోవడం.. డిజైన్ల రూపకల్పన, వాటి ఆమోదం, పునరా వాస ప్రక్రియ, అటవీ అనుమతులు పొంద డంతో చేసిన జాప్యం వంటివన్నీ దీనికి కారణ మని తేల్చి చెప్పింది.

ఈ నిర్లక్ష్యం కారణంగానే ఆదిలాబాద్‌ జిల్లాలోని గొల్లవాగు, మత్తడి వాగు, నీల్వాయి, జగన్నాథ్‌పూర్‌ పెద్దవాగు, ర్యాలివాగు ప్రాజెక్టులు ఇంకా పూర్తికావడం లేదని, అనుకున్న ఆయకట్టుకు నీరందించ లేకపోతున్నాయని స్పష్టం చేసింది. ఈ ఐదు ప్రాజెక్టుల పరిధిలో 52 వేల ఎకరాలకు నీరి వ్వాల్సి ఉన్నా.. 13,900 ఎకరాలకు మాత్రమే ఇచ్చారని పేర్కొంది. సోమవారం శాసనసభకు సమర్పించిన నివేదికలో దీనికి సంబంధించిన వివరాలను పేర్కొంది. 2004–05 నుంచి 2015–16 వరకు ఈ ఐదు ప్రాజెక్టులకు కలిపి రూ.948.15 కోట్లు కేటాయించినా.. రూ.319 కోట్ల మేర ఖర్చు చేయలేకపోయారని కాగ్‌ పేర్కొంది. 2010–11 వరకు ఈ ప్రాజెక్టులకు కేంద్రం పరిధిలోని ఏఐబీపీ కింద రూ.228.63 కోట్ల సాయం అందినా.. కేవలం మత్తడివాగు, ర్యాలివాగులను మాత్రమే పూర్తి చేయగారని తెలిపింది. ఇక 11 ఏళ్లు గడిచినా గొల్లవాగు, నీల్వాయి, జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టులు పూర్తికాలేదని మండిపడింది.

కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ధి!
ప్రాజెక్టులకు అయ్యే వ్యయంలో హెచ్చు తగ్గులను కాంట్రాక్టు సంస్థే భరించాల్సి ఉన్నా వారికి అనుచిత లబ్ధి కలిగేలా నీటిపారుదల శాఖ వ్యవహరించిందని కాగ్‌ ఎత్తిచూపింది. జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టులో ఆనకట్ట పనికి అంచనాను రూ.65.69 కోట్లుగా నిర్ధారించినా, రూ.62.83 కోట్లుగా అంచనా వేశారని.. కానీ ఒప్పంద విలువను అందుకు అనుగుణంగా సర్దుబాటు చేయకపోవడంతో రూ.2.82 కోట్లు అనుచిత లబ్ధి చేకూరిందని తెలిపింది.

 మత్తడి వాగు కింద నిర్మించిన ఓ వంతెన విషయం లోనూ కాంట్రాక్టు సంస్థ నుంచి రూ.32.55 లక్షలు వసూలు చేయలేదని... గొల్లవాగు ప్రాజెక్టులో సైతం కాంట్రాక్టర్‌ ఒప్పంద విలువలో రూ.2.25 కోట్లు తగ్గించాల్సి ఉన్నా.. ఆ పని చేయలేదని తెలిపింది. మత్తడివాగు ప్రాజెక్టులో ఎలాంటి అవసరం లేకుండానే రూ.36.76 లక్షలతో సాగునీటి శాఖ కొన్ని క్వార్టర్లను నిర్మించి వృథాగా వదిలేసిందని పేర్కొంది. ఈ దృష్ట్యా ప్రాజెక్టు పనులు చేపట్టడానికి ముందే పునరావాస కార్యకలాపాలను పూర్తి చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. సాగులోకి తెచ్చే వాస్తవ ఆయకట్టును లెక్కించేందుకు నిర్దిష్టమైన గడువులోగా రెవెన్యూ శాఖతో కలిసి ఉమ్మడి తనిఖీ చేపట్టాలని పేర్కొంది. ఇక దేవాదుల మూడో దశ ప్యాకేజీ–4లో ఇంధన, కందెన ధరల్లో సర్దుబాటు పేరుతో అదనంగా రూ.4.74 కోట్లు చెల్లించినట్లుగా కాగ్‌ ఎత్తిచూపింది.

కొత్త ‘దారులు’ చూపుతున్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్‌: రోడ్ల పనుల విషయంలో కొందరు కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం అయాచిత లబ్ధి చేకూర్చిందని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) స్పష్టం చేసింది. కంది–షాద్‌నగర్‌ రోడ్డులో కాంట్రాక్టర్‌ సకాలంలో పనులు చేయనం దున ఒప్పందం రద్దు చేసుకోవాలని ఆ పనిని పర్యవేక్షించే సలహాదారు, రోడ్లు భవనాల శాఖ ప్రభుత్వానికి నివేదించింది. అయినప్పటికీ ఒప్పందంలో లేని విధంగా అదనపు పూచీకత్తుతో గడువు పొడిగిం చినట్లుగా కాగ్‌ బట్టబయలు చేసింది.

 2015 మార్చి నాటికి ఈ పని పూర్తి కావాల్సి ఉండగా.. సకాలంలో పూర్తి కాలేదు. కాంట్రాక్టర్‌ అభ్యర్థన మేరకు సెప్టెంబర్‌ వరకు గడువును పొడిగించింది. రూ.10 కోట్ల అదనపు పూచీకత్తు తీసుకుని 2017 మే వరకు ప్రభుత్వం ఆ కాంట్రాక్టరుకు గడువు పొడిగించిందని కాగ్‌ స్పష్టం చేసింది. సకాలంలో పనులు చేయకుంటే 10 శాతం పరిహారం విధించాలన్న నిబంధన ఉన్నా.. దాన్ని అమలు చేయలేదని పేర్కొంది. అలా కాంట్రాక్టరుకు రూ.19.23 కోట్ల అయాచిత లబ్ధి కలిగిందని తేటతెల్లం చేసింది.

 కంది–చేవెళ్ల మార్గంలో కూడా సకాలంలో పనులు చేయనందున ఒప్పందం రద్దు చేసుకోవాలని ప్రభుత్వానికి సలహాదారు సిఫారసు చేశారు. రద్దు చేసుకోకపోగా శంకరపల్లి నుంచి చేవెళ్ల వరకు నాలుగు వరుసల రోడ్డు నిర్మాణ బాధ్యతను రూ.29.28 కోట్ల అంచనా వ్యయంతో అదే కాంట్రాక్టరుకు ప్రభుత్వం అప్పగించిందని కాగ్‌ పేర్కొంది. ఆర్టీసీ బస్సులపై ప్రకటనల కోసం ఏజెంటుతో జరిగిన ఒప్పందంలో సంస్థ రూ.52.40 లక్షలు నష్టపోయిందని కాగ్‌ తెలిపింది. బస్సుల సంఖ్యను తక్కువగా చూపటం వల్ల ఈ నష్టం జరిగినట్టు కాగ్‌ తేల్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement