రామాలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో చేపట్టిన రిలేదీక్షలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి.
భద్రాచలం: రామాలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో చేపట్టిన రిలేదీక్షలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఆదివారం దీక్షలను ప్రారంభించిన ఆలయ స్థానాచార్యులు స్థలశాయి మాట్లాడుతూ దేవస్థానం పేరు మార్చాలని తాము ప్రయత్నిస్తున్నట్లు కొంతమంది విషపూరిత ప్రచారం చేస్తున్నారని, భద్రాచల క్షేత్ర మహత్యంలో భాగంగానే అవతారానికి ఉన్న ప్రాముఖ్యతనుబట్టి రాముడికి రామనారాయణ అనే నామం ఉందన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. దీనికి తగిన ఆధారాలు ఉన్నాయని వాదించినందుకే ఈఓ తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
దీక్షకు మద్దతు తెలిపిన నవ తెలంగాణ బ్రాహ్మణ అర్చక సేవా సంఘం అధ్యక్షుడు రాహుల్ దేశ్‌పాండే మాట్లాడుతూ రామనారాయణ నామం అంశంపై చర్చించేందుకు ఆలయ వేదపండితులు సిద్ధంగా ఉన్నా దీనిని వివాదాస్పదం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం చొరవచూపి ఈ వివాదాన్ని పరిష్కరించాలని కోరారు.