‘బతుకమ్మ’తో భరోసా 

Bathukamma Sarees Are Going To Be Ready - Sakshi

సిరిసిల్ల నేతన్నలకు చేతినిండా పని 

రోజుకు లక్ష చీరల ఉత్పత్తి.. రెట్టింపైన కార్మికుల కూలి 

ఇప్పటికే 80 రంగుల్లో 30 లక్షల చీరలు సిద్ధం 

మరో 60 లక్షల చీరల ఉత్పత్తికి ప్రణాళిక

సిరిసిల్ల :  మరమగ్గాల (పవర్‌లూమ్స్‌) మధ్య వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తున్న ఇతని పేరు బొమ్మెన నాగరాజు (41). సిరిసిల్లలోని శివనగర్‌లో సాంచాలపై బతుకమ్మ చీరలను నేస్తున్నాడు. నిత్యం 12 గంటలపాటు సాంచాల మధ్య నిలబడి వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తే.. నాగరాజుకు వారానికి రూ.4 వేల కూలి వస్తుంది. అంటే నెలకు రూ.16 వేలు వస్తున్నాయి. ఇదే పనికి గతంలో నెలకు రూ.8 వేలకు మించి కూలి రాకపోయేది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ పండుగ కానుకగా చీరలను అందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కార్మికులకు చేయూతనందించటం కోసం ప్రభుత్వం ఈ చీరల తయారీ ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు అప్పగించింది. దీంతో ఒక్క నాగరాజుకే కాదు.. స్థానికంగా ఉన్న పదివేల మంది నేత కార్మికులకు చేతినిండా పనిదొరికింది. కూలి రెట్టింపు అయింది. ప్రస్తుతం ఇక్కడ నిత్యం 1.07 లక్షల చీరలను తయారు చేస్తున్నారు.  

80 రంగుల్లో చీరలు.. 
సిరిసిల్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా 80 రంగుల్లో బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. గతేడాది బతుకమ్మ చీరలను సిరిసిల్లలో ఉత్పత్తిచేసినా.. గడువులోగా పూర్తి స్థాయిలో చీరల వస్త్రం అందలేదు. 45 లక్షల చీరలను సిరిసిల్లలో ఉత్పత్తి చేయగా, మరో 55 లక్షల చీరలను సూరత్‌ నుంచి టెండర్‌ ద్వారా కొనుగోలు చేశారు. దీంతో నాసిరకం చీరలు ఇచ్చారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యం లో గతంలో ఎదురైన ఇబ్బందులను అధిగమిస్తూ.. మొత్తం ఆర్డర్‌ను సిరిసిల్ల నేతన్నలకు అందించారు. దీంతో జరీ అంచుతో కూడిన నాణ్యమైన చీరలను సిరిసిల్లలో ఉత్పత్తి చేస్తున్నారు. 20 వేల పవర్‌లూమ్స్‌పై చీరలను ఉత్పత్తి చేయాల్సి ఉండగా, ప్రస్తుతం 14 వేల మగ్గాలపై ఉత్పత్తి సాగుతోంది. మరో 6 వేల సాంచాలపై బతుకమ్మ చీరల బీములను ఎక్కించేందుకు జౌళిశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 20 వేల సాంచాలపై బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేస్తే, గడువులోగా 90 లక్షల చీరలను ప్రభుత్వానికి అందించేందుకు అవకాశం ఉంది. 

కార్మికుల ఉపాధే లక్ష్యం.. 
సంక్షోభంలో ఉన్న నేతన్నలను ఆదుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పరిశ్రమలు, చేనేత, జౌళిశాఖ మంత్రి కె.తారక రామారావు కార్మికుల ఉపాధి లక్ష్యంగా బతుకమ్మ చీరల పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని తెల్లరేషన్‌ కార్డుదారులైన ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరను సారెగా ఇవ్వడం.. ఇటు సిరిసిల్ల నేతన్నలకు బతుకుదెరువు చూపడమే ఈ పథకం ఉద్దేశం. ఇందులో చీరల వస్త్రం ఉత్పత్తికి ప్రతీ మీటరుకు రూ.32 ఇస్తుండగా.. ఆసామికి మీటరు వస్త్రం ఉత్పత్తి చేస్తే రూ.8.50, కార్మికుడికి రూ.4.25 చొప్పున ముందే కూలి ధరలను నిర్ధారించారు. వార్పిన్‌ కార్మికుడికి ఒక్కో బీముకు రూ.430, వైపని కార్మికుడికి ఒక్కో బీముకు రూ.375 కూలి రేట్లను నిర్ణయించడంతో గతంతో పోలిస్తే రెండింతల కూలి కార్మికులకు గిట్టుబాటు అవుతోంది. సిరిసిల్ల వస్త్రపరిశ్రమలో ఈ పథకంవల్ల అన్నిరంగాలకు చెందిన పదివేలమంది కార్మికులు మెరుగైన ఉపాధి పొందుతున్నారు. మంత్రి కేటీఆర్‌ చొరవతోనే తమకు మంచి ఉపాధి లభిస్తోందని కార్మికులు అంటున్నారు.

 చీరల ఉత్పత్తిపై నిఘా.. 
ఇక్కడి నేతన్నలకు ఉపాధి కల్పించే లక్ష్యంతోనే ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చింది. అయితే ఎవరైనా వస్త్ర వ్యాపారులు సూరత్, భివండి, షోలాపూర్, ముంబై వంటి ప్రాంతాల నుంచి చీరల బట్టను దిగుమతి చేస్తారనే అనుమానంతో అధికారులు బతుకమ్మ చీరల ఉత్పత్తిపై నిఘా ఉంచారు. హైదరాబాద్, కామారెడ్డి, కరీంనగర్‌ నుంచి సిరిసిల్లలోకి ప్రవేశించే మార్గాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. జౌళిశాఖకు చెందిన ఏడు బృందాలతో వార్పిన్‌ యూనిట్లపై నిఘా ఉంచారు. ట్యాబ్‌లలో చీరల ఉత్పత్తి వివరాలను నమోదు చేస్తున్నారు. 20 మంది సాంకేతిక సిబ్బంది చీరల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఉత్పత్తి అయిన చీరల బట్టను ఎప్పటికప్పుడు సేకరిస్తూ.. గోదాములో నిల్వ చేస్తున్నారు. రేయింబవళ్లు సాంచాలు ఆగకుండా బతుకమ్మ చీరల ఉత్పత్తి సాగుతోంది. శ్రమ అధికమైనా మెరుగైన వేతనాలు రావడంతో కార్మికులు ఉత్సాహంతో పనిచేస్తున్నారు.  

నేడు చైతన్య ర్యాలీ.. 
20 వేల సాంచాలపై బతుకమ్మ చీరలను నేయాలని కోరుతూ సోమవారం కార్మికులు చైతన్య ర్యాలీని నిర్వహించనున్నారు. బీవై నగర్‌లోని నేతబజారు  నుంచి వస్త్రోత్పత్తిదారులతో బైక్‌ ర్యాలీని నిర్వహిం చనున్నారు. ‘బతుకమ్మ’తో బతుకుదెరువు ఉందని చాటిచెప్పేందుకు పట్టణాల్లో ఈ ర్యాలీని నిర్వహించాలని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ డైరెక్టర్‌ శైలజారామయ్యర్‌ అధికారులకు సూచించారు.  

రోజుకు రూ.వెయ్యి వస్తున్నాయి.. 
బతుకమ్మ చీరల బీములు నింపితే రోజుకు రూ.వెయ్యి కూలీ లభిస్తుంది. గతంలో రూ.500 వచ్చేవి. రోజూ రెండు, మూడు బీములు నింపుతున్నా. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు. నా భార్య నవ్య బీడీ కార్మికురాలు. సిరిసిల్లలో కిరాయి ఇంట్లో ఉండి పని చేస్తున్నా. గతంలో భివండిలో పని చేశాను. అక్కడి కంటే సిరిసిల్లలోనే మంచి జీతం వస్తోంది. నా కంటే ఎక్కువ కూలీ సంపాదించే వాళ్లు కూడా ఉన్నారు.     – మెండు శ్రీనివాస్, వార్పర్‌ 

చెల్లింపులకు ఇబ్బంది లేదు.. 
బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేస్తున్న వారికి డబ్బు చెల్లింపుల్లో ఇబ్బంది లేదు. ఆర్డర్‌ ప్రకారం వస్త్రొత్పత్తిదారులకు చెల్లింపులను ఆన్‌లైన్‌లోద్వారా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. గడువులోగా అందరూ బతుకమ్మ చీరలను అందించాలి. సిరిసిల్లలో సాంచాలపై ఇతర ఉత్పత్తులను నిలిపివేసి బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేయాలి.
    – పి.యాదగిరి, టెస్కో జనరల్‌ మేనేజర్‌ 

అందరికీ ఆర్డర్లు ఇచ్చాం.. 
సిరిసిల్లలో వస్త్రోత్పత్తిదారులందరికీ బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చాం. 120 మ్యాక్స్‌ సంఘాలకు, మరో 77 చిన్నతరహా పరిశ్రమల యజమానులకు ఆర్డర్లు ఇచ్చాం. ఇంకా ఎవరైనా ముందుకు వస్తే ఇస్తాం. ప్రస్తుతం 14 వేల మగ్గాలపై చీరలు ఉత్పత్తి అవుతున్నాయి. కొందరు ఇంకా తెల్లని పాలిస్టర్‌ బట్ట ఉత్పత్తి చేస్తున్నారు. వాళ్లు బతుకమ్మ చీరలు నేయాల్సి ఉంది.     – వి.అశోక్‌రావు, జౌళిశాఖ ఏడీ 

ఇవీ బతుకమ్మ చీరల ఆర్డర్లు.. 
అవసరమైన చీరలు                  :     90 లక్షలు 
ఇప్పటికే ఉత్పత్తయినవి            :     30 లక్షలు 
చీరలు ఉత్పత్తి చేసే పవర్‌లూమ్స్‌: 14 వేలు 
అవసరం అయిన వస్త్రం            : 5.94 కోట్ల మీటర్లు 
నిత్యం ఉత్పత్తవుతున్న వస్త్రం   : 7 లక్షల మీటర్లు 
శ్రమించే నేత కార్మికులు          : 10వేల మంది 
        (అన్ని విభాగాల్లో) 
చీరల ఆర్డర్ల ఖరీదు                :     రూ.300 కోట్లు 
ఆర్డరు గడువు                      :     సెప్టెంబర్‌ నెలాఖరు  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top