పైసలుంటేనే పవర్‌!

Arrears Rising In Power Development In Nalgonda - Sakshi

నల్లగొండ : పైసలుంటేనే పవర్‌. లేదంటే చీమ్మ చీకట్లే. ఇకనుంచి విద్యుత్‌శాఖ కొత్త విధానాలను అవలంబించబోతుంది. నెలంతా విద్యుత్‌ సరఫరా చేసిన తదుపరే వినియోగదారులు వాడుకున్న దానికి సంబంధించి బిల్లు వసూలు చేస్తుండేవారు. కానీ కొత్త విధానాలకు శ్రీకారం చుట్టింది. ఇకనుంచి ముందు పైసలు చెల్లిస్తేనే కరెంట్‌ ఇస్తారు. లేదంటే చీకట్లో ఉండాల్సిందే. అందులో భాగంగానే మొదటి విడతగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్‌ విద్యుత్‌మీటర్లను అమర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ విషయంలో మొదటినుంచి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వస్తోంది. అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో బకాయిలు భారీ ఎత్తున పెరిగిపోతున్నాయి. వాటి చెల్లింపులో ఆయా శాఖల్లో అధికారుల మధ్య సమన్వయ లోపం ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యుత్‌శాఖ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.  ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్‌ విద్యుత్‌ మీటర్లు పెడితే బకాయిల భారం నుంచి తప్పించుకోవచ్చని భావించి వెంటనే బిగించాలని నిర్ణయించింది. మొదటి విడతగా కొన్ని మంజూరు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాల్లో మీటర్లు బిగిస్తున్నారు. అతి ఎక్కువగా బకాయిలు గ్రామ పంచాయతీలు చెల్లించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా రూ.18,419.03 లక్షలు బకాయి పడ్డాయి. పంచాయతీలు, మున్సిపాలిటీలతోపాటు జిల్లా వ్యాప్తంగా 27 ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు సంబంధించి రూ.192.48 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. జిల్లాలో మొదటి విడత పూర్తి కావస్తుండగా, నల్లగొండ జిల్లాలో మాత్రం అలస్యమవుతోంది.

విద్యుత్‌ చౌర్యానికి చెక్‌..
కొందరు వినియోగదారులు మీటర్‌లో వైర్లు పెట్టి విద్యుత్‌చౌర్యానికి పాల్పడుతున్నారు. దాంతో దొడ్డి దారిన విద్యుత్‌ వాడుకొని బిల్లు తప్పించుకుంటున్నారు. అ«ధికారులు మాత్రం  డిమాండ్‌కు తగట్లుగా బిల్లులు వసూలు చేస్తున్నారు కానీ, అది ప్రభుత్వ కార్యాలయాలపై మాత్రమే అదనంగా భారం పడే అవకాశం ఉంది. దానిని అరికట్టేం దుకు ప్రీపెయిడ్‌ మీటర్లు ఎంతగానో దోహదపడుతాయి. గతంలో ముందుగా కరెంటు వాడుకొని నెల తర్వాత మీటర్లలో తిరిగిన యూనిట్ల ఆధారంగా బిల్లును వసూలు చేస్తూ వస్తున్నారు. ఇక నుం చి ప్రీపెయిడ్‌ మీటర్లతో ముందే నెలకు సరిపడా విద్యుత్‌ను డబ్బులు పెట్టి కొనుకోవాల్సి ఉంది.

బకాయిలు బాధలు ఉండవు..
విద్యుత్‌ అధికారులకు కూడా బకాయిల వసూళ్ల బాధలు కూడా ఉండవు. ముందే ప్రీపెయిడ్‌ మీటర్లలో చిప్‌ కొనుకుంటేనే విద్యుత్‌ సరఫరా అవుతుంది. దీంతో తర్వాత బిల్లు వసూలు అనే పని అధికారులకు ఉండదు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు ముందస్తుగానే వారు వినియోగించే విద్యుత్‌ కొనుగోలు చేసుకోనున్నారు.

ప్రభుత్వ కార్యాలయాలకు తిప్పలే... 
కొన్ని ప్రభుత్వ శాఖలకు నిధులే ఉండవు. విద్యుత్‌ బిల్లులు సంవత్సరాల తరబడి చెల్లించని శాఖలు కూడా ఉన్నాయి. అలాంటి శాఖలకు ప్రీపెయిడ్‌ మీటర్లతో తిప్పలు తప్పవు. కచ్చితంగా ఆయా శా ఖాధికారులు ముందస్తుగానే విద్యుత్‌కు సంబం ధించి బిల్లులు అనుమతి కోసం ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి రానుంది.

వద్దంటున్న కొన్ని శాఖల అధికారులు... 
కొన్ని ముఖ్యమైన అత్యావసరమైన ప్రభుత్వ శాఖల అధికారులు ప్రీపెయిడ్‌ మీటర్లను బిగిం చొద్దంటూ విద్యుత్‌ సిబ్బందికి సూచిస్తున్నారు. దీంతో ఆ కార్యాలయాలకు మీటర్లు బిగించలేకపోతున్నారు. అత్యవసరమైన శాఖలు కావడంతో విద్యుత్‌ అధికారులు కూడా వారి విషయంలో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి.

కార్యాలయాల తర్వాత గృహాలకు.. 
ప్రభుత్వ కార్యాలయాల్లో మొదటి విడతగా ప్రీపెయిడ్‌ మీటర్లను వినియోగిస్తున్నారు. అ తదుపరి అందులోనే లోటుపాట్లను సరి చేసుకొని గృహాలకు కూడా అమర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే మొదటి విడత జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్‌మీటర్లను బిగిస్తున్నట్లు జిల్లా టాన్స్‌కో ఎస్‌ఇ కృష్ణయ్య తెలిపారు. 

మొదటి విడతగా 963 మీటర్లు.. 
మొదటి విడతగా జిల్లాలో 963 మీటర్లను మంజూరు చేశారు. నెల పదిహేను రోజులనుంచి ఇప్పటి వరకు 483 మీటర్లను ప్రభుత్వ కార్యాలయాల్లో బిగించారు. కార్యక్రమం కొంత ఆలస్యమే అవుతోంది. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ శాఖల విద్యుత్‌ బిల్లుల బకాయిలు రూ.192.48 కోట్లు వ్యవసాయ శాఖ, పశుసంవర్థక శాఖ, బీసీ సంక్షేమ, ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్, సైన్స్‌ శాఖ, పౌర సరఫరాల తదితర రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాల పరిధిలోని శాఖలకు సంబంధించి విద్యుత్‌ బకాయిలు భారీగా పేరుకుపోయాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top