‘డీఎం గారూ.. నేను సీఎంను మాట్లాడుతున్నా.. ఆర్టీసీ సమ్మె ముగియగానే పాములపర్తి ఊళ్లోకి బస్సు నడపండి.’..
పాములపర్తికి చేరిన బస్సు
వెలిగిన హైమాస్ట్ లైట్లు
ఆనందంలో స్థానికులు
వర్గల్ : ‘డీఎం గారూ.. నేను సీఎంను మాట్లాడుతున్నా.. ఆర్టీసీ సమ్మె ముగియగానే పాములపర్తి ఊళ్లోకి బస్సు నడపండి.’.. సాక్షాత్తు సీఎం కేసీఆర్ ఈనెల 10న వర్గల్ మండలం పాములపర్తి సందర్శించిన సందర్భంగా చోటు చేసుకున్న సన్నివేశం. ఆయన స్థానికులకు ఇచ్చిన హామీ మేరకు గురువారం గ్రామానికి బస్సు చేరుకుంది. ఈ బస్సును గడా అధికారి హన్మంతరావు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ బాలసుబ్రహ్మణ్యంతో కలిసిప్రారంభించారు.
అదే బస్సులో సర్పంచ్ మ్యాకల చంద్రకళ, ఎంపీటీసీ సభ్యులు స్వప్న, గడా తహశీల్దార్ యాదగిరిరెడ్డి, ఎంపీడీఓ జయదేవ్, తహశీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు హన్మంతరావు, పిట్ల సత్యనారాయణ, మాదాసు శ్రీనివాస్, కనకయ్య, రాజేష్, సుధాకర్‌రెడ్డి తదితరులు గ్రామం నడి బొడ్డుకు చేరుకున్నారు. అనంతరం సీఎం హామీల అమలులో భాగంగా గ్రామ కూడళ్లలో ఏర్పాటు చేసిన రెండు హైమాస్ట్ లైట్లను హన్మంతరావు స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఒక్కొక్కటిగా సీఎం హామీలు అమలవుతుండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.